భక్తిశ్రద్ధలతో అయ్యప్ప ఇరుముళ్ళు
శబరికి బయలుదేరిన అయ్యప్ప స్వాములు
మోత్కూరు జనవరి 5 జనంసాక్షి : నలభై ఒక్క రోజుల పాటు కఠిన నియమాలతో అయ్యప్ప దీక్షను పూర్తి చేసిన అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో ఇరుముళ్లు సిద్ధం చేసుకున్నారు. గురువారం మోత్కూరు మండలంలోని పొడిచేడు శ్రీ బీరప్ప దేవాలయంలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప ఇరుముళ్ళు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కన్నె, కత్తి, గద,గురు స్వాములు 22 మంది స్వాములు ఇరుముళ్లు కట్టుకున్నారు. వేద మంత్రాల మంత్రోచ్చరణలో ఇరుముళ్లు కట్టుకుని శబరికి బయల్దేరారు. అంతకుముందు సన్నిధానం లో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీరప్ప దేవాలయం అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగింది. గ్రామ సర్పంచ్ పేలపూడి మధు వచ్చిన భక్తులకు దేవాలయంలో అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా శబరికి బయల్దేరిన స్వాములను కుటుంబ సభ్యులు, భక్తులు పాదాభివందనం చేసి మొక్కులు తీర్చుకున్నారు. అయ్యప్ప స్వాములు తలపై ఇరుముళ్లను పెట్టుకుని మణికంఠ నామస్మరణతో ముందుకు సాగారు. కుటుంబ సభ్యులు, భక్తులు , గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




