మునగాల, మే 02(జనంసాక్షి): గ్రామాలలోని పల్లె దవాఖానాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కోరారు. జిల్లా వ్యాప్తంగా 122 గ్రామాల పరిధిలో పల్లె దవాఖానా వైద్యాధికారుల సేవలు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. ఆకుపాముల పరిధిలోని పల్లె దావఖానాలో దాని పరిధిలో అందుతున్న సేవలను, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలలో ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. బిపి, షుగర్ వ్యాధులు , వివిధ రకాలైన క్యాన్సర్ల నివారణకు ముందస్తు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు అందించాలని కోరారు. గ్రామాలలో ఉన్న వయోవృద్ధుల కొరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని సూచించారు. పల్లె దవాఖానలకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించు ఉచిత పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని, ఉచిత మందులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా ఎన్నో వ్యాధులను దరిచేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన ఎమ్.ఎల్. హెచ్ పి వైద్యురాలు దివ్య , ఆరోగ్య కార్యకర్తలు ఆశ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
పల్లె దవాఖానాల సేవలు సద్వినియోగం చేసుకోవాలి – డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి




