Wednesday, 4 November 2026

పసికందును పీక్కుతిన్న ఎలుకలు

– నాచారంలో హృదయ విదారక ఘటన
హైదరాబాద్‌, జూన్‌5(జనం సాక్షి) : నాచారంలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి పసికందును గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. ఆ శిశువును రాత్రంతా ఎలుకలు పీక్కుతిన్నాయి. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పసి పాప ఏడుపు విన్న స్థానికులు అప్రమత్తమై 108 సిబ్బందికి సమాచారం అందించారు. పసికందుకు 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసింది. ఆ తర్వాత శిశువును మెరుగైన చికిత్స కోసం నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి తల్లిదండ్రుల వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.