Wednesday, 4 November 2026

పసికూనలపై పాక్ ప్రతాపం

నేపియర్: ప్రపంచ కప్లో తొలి రెండు మ్యాచ్లలో చిత్తుగా ఓడిపోయి అభాసుపాలైన పాకిస్థాన్.. చిన్న జట్లపై రాణిస్తోంది. జింబాబ్వేపై అతికష్టం మీద నెగ్గి బోణీ కొట్టిన పాక్.. తాజాగా పసికూన యూఏఈపై ప్రతాపం చూపించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో పాక్ 129 పరుగులతో యూఏఈపై విజయం సాధించింది. దీంతో ప్రపంచ కప్ నాకౌట్ అవకాశాల్ని కాపాడుకుంది. తొలుత నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసి పాక్.. యూఏఈని 50 ఓవర్లలో 210/8 స్కోరుకు కట్టడి చేసింది. ఈ ఈవెంట్లో పాక్ 300 స్కోరు దాటడం ఇదే తొలిసారి. భారత్, వెస్టిండీస్ల మ్యాచ్లలో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.

రాణించిన షెహజాద్: ఆరంభంలో అహ్మద్ షెహజాద్, హారిస్ సొహైల్ నిలకడగా ఆడటంతో పాటు చివర్లో మిస్బా మెరుపు బ్యాటింగ్ చేయడంతో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది. 10 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన పాక్ ను అహ్మద్ షెహజాద్(93), హారిస్ సొహైల్(70) అర్థ శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 166 బంతుల్లో 150 పరుగులు జోడించారు. వీరు అవుటైన తర్వాత మఖ్సూద్, మిస్బా బ్యాట్ ఝుళిపించారు. మక్సూద్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. మిస్బా 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. చివర్లో ఆఫ్రిది 8 బంతుల్లో 2 సిక్సర్లు, ఫోర్ తో 21 పరుగులు చేశాడు.

25 పరుగులకే 3 వికెట్లు: లక్ష్యఛేదనలో యూఏఈ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేకపోయింది. ఖుర్రం ఖాన్, షైమన్ నాలుగో వికెట్కు 83 పరుగులు జోడించి కాసేపు వికెట్లపతనాకి అడ్డుకట్ట వేశారు. షైమన్ (62) హాఫ్ సెంచరీ చేయగా,  ఖుర్రం ఖాన్ (43) కొద్దిలో చేజార్చుకున్నాడు. చివర్లో అంజాద్ (40), స్వప్నిల్ పాటిల్ (36) రాణించారు. పాక్ బౌలర్లు సొహైల్ ఖాన్, అఫ్రీది, వాహబ్ రియాజ్ రెండేసి వికెట్లు తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *