శైలజానాథ్
పాలకొల్లు : పేదలు, దళిత వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడితో విద్యా బోధన జరపాలనే ఆలోచన ప్రభుత్వ పరంగా జరగుతోందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పాఠశాల విద్యా కమిటీల్లోనూ ఇక నుంచి విద్యార్థుల తల్లిదండ్రులే ఉంటారని… ముఖ్యంగా తల్లులకు భాగస్యామ్యం కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పాఠశాల విద్యా కమిటీలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 20 వేల తరగతి గదుల నిర్మాణం జరగగా, తెదేపా హయాంలో ఒక్క తరగతి గది నిర్మాణం కూడా జరగలేదని విమర్శించారు. అనంతరం మంత్రి గాంధీబొమ్మల సెంటర్‌లోని జగ్జీవస్‌రామ్ విగ్రహాన్ని అవిష్కరించారు. పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఆయన వెంట పాలకొల్లు ఎమ్మెల్యే బంగారు ఉషారాణి ఉన్నారు.




