Thursday, 5 November 2026

పాఠ్యాంశంగా మొక్కల పెంపకం కావాలి

టీచర్లు ప్రధాన బాధ్యత తీసుకోవాలి: కడియం

హైదరాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ): ప్రతి విద్యార్థి మొక్కలు నాటడాన్ని దైనందిన కార్యక్రమంగా అలవర్చుకోవాలని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి సూచించారు. నాటిన ప్రతీ మొక్క బ్రతికే విధంగా ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. పిల్లలతో మొక్కలు నాటించడంతో పాటు వాటిని రక్షించే విధంగా కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో, దేవాలయాల ప్రాంగణంలో మొక్కలను నాటించాలన్నారు. నాటిన ప్రతీ మొక్క జీవించే విధంగా పర్యవేక్షణ చేయాలని పిలుపునిచ్చారు. హరితహారంతో పాటు సిఎం కెసిఆర్‌ విద్యారంగానికి పెద్దపిట వేస్తున్నారని అన్నారు. కేజీ టూ పీజీ విద్యాలో భాగంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. బంగారు తెలంగాణ సాధనలో హరితహారం, ఉచిత విద్య కూడా భాగమేనని అన్నారు. ఇందుకోసం కేసీఆర్‌ వెంట నడిచి అనుకున్న లక్ష్యాన్ని చేరాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఉన్న అన్నిరంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్వప్నం కేజీ టు పీజీ విద్యాపథకం అమలుకు కార్యాచరణ మొదలైంది. ప్రభుత్వం గత రెండేండ్లుగా ఇందుకోసం బలమైన పునాదులు వేసింది. ఇకపై ఏటా పాఠశాలలు కళాశాలల సంఖ్యతోపాటు తరగతుల అప్‌గ్రెడేషన్‌ జరుపుతూ ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల వచ్చే రెండేండ్లలో కేజీ టు పీజీ విద్యపూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందన్నారు. ఇంతకాలం సరైన విద్యకు నోచని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ విద్యార్థులకు ఉత్తమ విద్యకు మార్గం సుగమం అయ్యిందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మానవవనరుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ఉద్యమ సమయంలో తాను కలలుగన్న కేజీ టు పీజీ పథకానికి రూపమిచ్చారు. రాష్ట్రంలో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నాణ్యమైన విద్యతో ఉద్యోగులుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దినప్పుడే ఆ వర్గాల అభ్యున్నతి సాధ్యమని కేసీఆర్‌ విశ్వసించారు. ఈ మేరకు భారీ సంఖ్యలో రెసిడెన్సియల్‌ స్కూళ్లను ప్రారంభించారని అన్నారు. పాఠశాలల ద్వారా మెరుగైన ఫలితాలు కూడా వస్తున్నాయి. నిరుపేద కుటుంబాలనుంచి వచ్చిన విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం ఈ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ద్వారా లభించిందని కడియం గుర్తు చేశారు. మరో రెండేండ్లలో రెసిడెన్షియల్‌ కళాశాలల్లో చదివిన విద్యార్థుల కోసం పీజీ కాలేజీలు ఏర్పాటవుతాయన్నారు. దీంతో కే జీ టూ పీజీ ఉచిత విద్య సంపూర్ణంగా అమలులోకి వస్తుందని వివరించారు. ఇకపోతే అంగన్‌వాడీలకు నిధుల రాకతో పాటు ప్రోత్సాహం కారణంగా అవిప్రీస్కూళ్లుగా మారుతున్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రీస్కూల్‌ బోధన ప్రారంభించారు. 3 ఏళ్ల వయస్సున్న చిన్నారులను నర్సరీ, 4ఏళ్ల చిన్నారులను ఎల్‌కేజీ, 5 ఏళ్ల చిన్నారులను యూకేజీలో చేరుస్తూ తరగతులుగా విభజించి ఆంగ్లమాధ్యమం కూడా బోధిస్తున్నారు. దీనిపై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ప్రీస్కూల్‌ విధానం ప్రవేశపెట్టడంతో అక్కడ పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. పురపాలక సంఘాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు కొత్త రూపుతో కనిపిస్తున్నాయి. ఈ కేంద్రాలకు కొత్తకొత్త సామగ్రి సమకూరుస్తున్నారు. ముందుగా పురపాలక సంఘాల్లోని కేంద్రాల్లో పనులు చేపడుతున్నారు. పురపాలక సంఘాల నిధులతో పలు చోట్ల సదుపాయాలు కల్పించారు. దీనికితోడు దాతలు ముందుకొచ్చి తమవంతు సాయం చేస్తున్నారు. చాలీచాలని వరండాలతో ఇంతకాలం అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల నిధులను వీటికోసం ఖర్చు చేయడంతో పాటు దాతల సహాయం తీసుకుని అభివృద్ధి బాటలో నడిపించాలని ముఖ్యమంత్రి అభిలషించారు. దీంతోఅంగన్‌వాడీ కేంద్రాల స్వరూపమే మారిపోతోంది. కార్పోరేట్‌ స్థాయిలో ఆ కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో పురపాలక సంఘాల నిధులతో వాటి పరిధిలోని కేంద్రాలకు సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. కేంద్రాల్లో చిన్నారులకు కూర్చునేందుకు కుర్చీలు, టేబుళ్లు, ఎల్‌ఈడీ టీవీలు, యూనిఫామ్‌ , ఆట పరికరాలు సమకూరుస్తున్నారు. భవనాలకు రంగులు వేసి వాటిపై ఆకర్షణీయమైన బొమ్మలు వేస్తున్నారు. సదుపాయాలు కల్పించారు.