పారదర్శకంగా ఓటర్ జాబితా రూపకల్పనకు చర్యలు తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 26 (జనం సాక్షి);పారదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారు లతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ లతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్నారు.మన రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాల ధ్రువీకరణ,అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ టర్న్ అవుట్ పెంపుకు తీసుకోవాల్సిన చర్యలు, నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి, జనాభా ఓటర్ల నిష్పత్తి తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు.అనంతరం తహసిల్దర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ, జిల్లాలోని పోలింగ్ కేంద్రాల జాబితా వివరాలను ఆన్ లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రతి మండలంలోని తమ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూసుకుని ధ్రువీకరించాలని కలెక్టర్ ఆదేశించారు.ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓట్లు, డెత్, షిఫ్ట్ అయిన ఓటర్లు లేకుండా బూత్ స్థాయి అధికారి ధృవీకరించాలని, ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లాలోని బూత్ స్థాయి అధికారుల జాబితా వివరాలు రాజకీయ పార్టీలకు అందించాలని, బూత్ స్థాయి ఏజెంట్ల వివరాలు సమర్పించాల్సిందిగా రాజకీయ పార్టీలకు సూచించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నూతనంగా మంజూరు చేసిన ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులు ముద్రించి అందించాలని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రిటర్నింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల వారీగా జనాభా ఓటర్ల నిష్పత్తి, లింగ నిష్పత్తి, ఓటర్లలో యువ ఓటర్ల నమోదు పై దృష్టి సారించి, వారి నిష్పత్తి పై సమాచారం అందించాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేర జనాభా, ఓటర్ నిష్పత్తి, లింగ నిష్పత్తి ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తహసిల్దారులకు కలెక్టర్ సూచించారు.ఈరోజు రేపు రెండు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. . ఫారం_ 6 ద్వారా ఎంతమంది నమోదయారని తెలుసుకున్నారు. 28 ఆదివారం సెప్టెంబర్ 2, 3 తేదీలలో జరిగే ప్రత్యేక నమోదులో 18,19 ఏళ్ళ యువ మహిళా ఓటర్ల నమోదు తక్కువగా ఉన్నందున వారిని ఓటర్ గా నమోదు చెయిoచాలన్నారు. . ఈ వీడియో కాన్ఫరెన్సు లో ఆర్డీవో చంద్రకళ, స్వీప్ ఆక్టివిటీస్ జిల్లా నోడల్ అధికారి రమేష్ బాబు , కలెక్టరేట్ సి విభాగం సూపరిండెంట్, ఎన్నికల సిబ్బంది సురేష్ సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.