Thursday, 5 November 2026

పిల్లాడి సమాధానానికి మంత్రి కెటిఆర్‌ ఫిదా

హైదరాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): మంత్రి కేటీఆర్‌ ఫన్నీ ట్వీట్‌ చేశారు. ఓ విద్యార్థి జవాబు పత్రాన్ని చూసి ఫిదా అయ్యారు. దానిని అందరికీ తెలపాలన్న తపనతో తన ట్విట్టర్‌ పేజీలో షేర్‌ చేస్తూ.. జీవితంలో విజయానికి షార్ట్‌కట్స్‌ ఉండవు అని ఎవరూ చెప్పారని ప్రశ్నించారు. ఈ జవాబు పత్రాన్ని చూస్తే కేటీఆర్‌ ట్వీట్‌ చేసింది నిజమే కదా అనిపించక తప్పదు. విద్యార్థి ప్రతిభను మెచ్చుకున్న కేటీఆర్‌.. టీచర్‌ను కూడా స్మార్ట్‌గా రైట్‌ మార్కు వేసేశారని పొగిడారు. ఈ బుడత క్రియేటివిటికి కేటీఆర్‌ ఫిదా అయిపోయారు.లైఫ్‌లో విజయం సాధించాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొని రావాల్సి ఉంటుందని అందరూ చెబుతుంటారు. కానీ ఈ పిల్లాడి ప్రతిభను అందరూ మెచ్చుకోవాల్సిందే. తనకిచ్చిన ప్రశ్నాపత్రంలో ఆకలితో ఉన్న పిల్లి.. ఏ మార్గం గుండా వెళ్లి పాలు తాగుతుందో దారి చూపించండి అని ప్రశ్న అడిగారు. సదరు విద్యార్థి మాత్రం ఆ దారేమి ఆలోచించకుండా.. పిల్లి పాలు తాగేందుకు షార్ట్‌కట్‌గా గీత గీసేశాడు. పిల్లాడి సమాధానానికి టీచర్‌ కూడా రైట్‌ మార్కు వేసేశారు. అది ఒక్కటి కాదు.. స్టార్‌ కూడా ఇచ్చారు. విద్యార్థి ప్రతిభావంతుడు అని భావిస్తేనే టీచర్లు స్టార్‌ మార్క్‌ ఇస్తుంటారు. కొందరు టీచర్లు అయితే ఈ విద్యార్థి చెప్పిన సమాధానం తప్పు అని రాంగ్‌ మార్క్‌ వేసేస్తారు.