పుచ్చకాయలు దొంగిలించినందుకు నగ్నంగా ఊరేగించారు

లాహార్ : నేరం ఆ చిన్నారులది కాదు…ఆకలిది. అయినా ఆ చిన్నారులను పట్టుకుని చితగ్గొట్టారు. ఒంటిమీద దుస్తులు విప్పించి నగ్నంగా ఊరేగించారు. ఇంతకూ ఈ చిన్నారులు చేసిన నేరమల్లా…ఒక దుకాణం నుంచి పుచ్చకాయలు (వాటర్ మెలాన్) దొంగిలించడమే. ఈ ఘటన పాకిస్థాన్‌లో చేటుచేసుకుంది. 9, 13 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఒక దుకాణం నుంచి పుచ్చకాయలు దొంగిలిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ముస్తాన్‌ర్ ఫెరోజ్, బషరత్, ఇర్ఫాన్ అనే ముగ్గురు వ్యక్తులు వారిని పట్టుకుని చితకబాదారు. అంతటితో ఆగకుండా ఆ ఇద్దరు పిల్లల దుస్తులు విప్పించి ఆ వీధిలో ఊరేగించారు. ఆ సన్నివేశాన్ని సెల్ ఫోన్‌లో కూడా చిత్రీకరించారు. విషయం తెలిసిన పోలీసులు రంగప్రవేశం చేసి దాడికి పాల్పడిన ముగ్గురుని అరెస్టు చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠిన శిక్ష విధించాలని మానవ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేశారు.