జనంసాక్షి , మంథని : అట్టడుగు వర్గాలకు అక్షరజ్ఞానం అందించి విశ్వానికి వెలుగులు అందించిన జ్యోతిరావుపూలే, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కల్పించి గౌరవించేలా రాజ్యాంగం, రిజర్వేషన్లు అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో సబ్బండవర్గాలు ముందడుగు వేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. మంథని మండలం గుంజపడుగు గ్రామంలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావుపూలే, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను భూపాలపల్లి జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి రాకేష్, మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ లతో కలిసి ఆయన ప్రారంబించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు పూలే, అంబేద్కర్ మన భవిష్యత్ తరాల కోసం గొప్పగా ఆలోచన చేశారన్నారు. వారి త్యాగాల ఫలితంగానే ఈనాడు అనేక ఫలాలు పొందుతున్నామని అన్నారు. అట్టడుగు వర్గాలకు అక్షర జ్ఞానంతోనే విజ్ఞానం, ఆలోచన వస్తుందని ఆలోచన చేసి అన్ని వర్గాలకు అక్షరాలు నేర్చించిన మహనీయుడు పూలే అని కొనియాడారు. అలాగే తన కుమారుడు మృత్యువుతో పోరాడుతున్నాడని తెలిసినా సమాజం బాగు కోసం, భవిష్యత్ తరాల బాగు కోసం కొడుకును త్యాగం చేసిన అంబేద్కర్ గొప్పవాడని ఆయన అన్నారు. అయితే మహనీయుల చరిత్ర తెలుసుకోకపోవడం మూలంగానే అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని, మనవర్గాల్లోనే మనస్పర్థలు వస్తున్నాయని అన్నారు. ఆనాటి బ్రాహ్మణీయ పాలకులు మహనీయులను అణిచివేస్తే ఈనాడు అదే బ్రాహ్మణీయ పాలన మహనీయుల చరిత్రను దాచిపెట్టి మనల్ని బానిసలు చేసిందన్నారు. 40 ఏండ్లు మంథని నియోజక వర్గాన్ని పరిపాలన చేసిన పాలకులు తండ్రి విగ్రహాలను తప్ప మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయలేదన్నారు. ఈనాడు తనపై విమర్శలు చేసే కాంగ్రెస్లో ఉన్న దళితనాయకులు 40ఏండ్లలో నాలుగు మహనీయుల విగ్రహాలు ఎందుకు పెట్టలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించాలని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడి పరిస్థతులను ఎదిరించి సమాజం మేలు కొలుపు కోసమే పోరాటం కొనసాగిస్తున్నానని ఆయన అన్నారు. ఆనాటి నుంచి ఈనాటి అట్టడుగువర్గాలకు మహనీయుల చరిత్ర తెలిస్తే ఆలోచనలు చేసి తిరుగుబాటు చేస్తారని, తమ అధికారం పోతుందని మహనీయుల చరిత్రను దాచిపెట్టారని ఆయన గుర్తుచేశారు. 40 ఏండ్లు మనం ఓట్లు వేస్తే అధికారంలో ఉన్న ఒకే కుటుంబం ఈ సమాజానికి ఏం చేసిందో అలోచన చేయాలన్నారు. మాయమాటలు నమ్మిఓట్లు వేసి అధికారం, పదవులు అప్పగిస్తున్నారని, బ్రాహ్మణీజాన్ని నమ్మితే నట్టేట ముంచుతారని ఆయన అన్నారు. 40ఏండ్ల చరిత్రలో ఏ కార్యకర్తను కుర్చీ ఎక్కించారా అని ప్రశ్నించారు. తమకు కుర్చీలు అధికారం ఉంటే చాలు ఎవరికి అవసరం లేదనే ఆలోచనలు తండ్రి కొడుకులవని ఆయన ఎద్దేవా చేశారు. ఏదైన పదవి కోసం కార్యకర్తను నిలబెట్టి మళ్లీ ఓడగొట్టడం వారి నైజమని గుంజపడుగుకు చెందిన దేవళ్ల మల్లన్న నిదర్శనమన్నారు. కానీ ఈ ప్రాంతంలోనే పేద బిడ్డల ఆకలి తీర్చాలని, ఆడబిడ్డల పెండ్లి చేయాలని, నిరుపేద బిడ్డకు చదువు చెప్పించాలని ఆలోచన చేసి తనవంతు సాయం చేయడం తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు. రూపాయి సాయం చేయనోళ్లను గౌరవిస్తూ సాయం చేసే తనపై కక్ష్యసాధించడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రతి ఒక్కరు ఆలోచన చేసి గతానికి ప్రస్తుతానికి వ్యత్యాసాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశానని, ఎన్నో కళాశాలలు తీసుకువచ్చానని ప్రస్తుత ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకుంటున్నాడని కళాశాలలు తీసుకువస్తే వాటి బిల్డింగ్లు, సౌకర్యాల మాటేమిటని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చిన 30ఏండ్ల తర్వాత కొండెల మారుతి ఆమరణ నిరాహర దీక్ష చేస్తే మంథనికి డిగ్రి కళాశాల వచ్చిందని, ఆ కళాశాలకు బిల్డింగ్ రావడానికి మరో 20ఏండ్లు పట్టిందన్నారు. అప్పటి వరకు మంథనిలో తండ్రి కొడుకులే అధికారంలో ఉన్నారని, వారి అభివృధ్దికి ఇవే నిలువెత్తు సాక్ష్యాలన్నారు. తాను ఎమ్మెల్యేగా నాలుగున్నర ఏండ్ల కాలంలో తనకు వచ్చే నిదులతో అనేక పనులు చేశానని, నా అక్కా చెల్లెలు అంగన్వాడీ కేంద్రాలకు వస్తే నిలుచోవాల్సి వస్తుందని, పిల్లలు కూర్చోవడానికి సరైన వసతులు లేవని అంగన్వాడీ కేంద్రాలకు కుర్చీలు, బేంచీలు ఇప్పించానని, ఈనాడు ఉక్కపోతలో ఉండకూడదని సోలార్ ఇన్వాటర్లు ఏర్పాటు చేసి ఫ్యాన్లు అమర్చిన చరిత్ర తనదేనన్నారు. మహనీయులను స్పూర్తిగా తీసుకుని అట్టుడుగు వర్గాలు అభివృధ్దిలోకి రావాలనే ఆరాటంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఇన్నేళ్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కుటుంబం ఏ ఒక్క ఎస్సీ బిడ్డకు వాళ్ల చేతులతో అన్నం పెట్టారా అని ఆలోచన చేయాలన్నారు. శ్రీపాదరావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆ కుటుంబం అమెరికాకు పోయి ఆస్తులు కూడబెట్టుకున్నారే కానీ ఈ ప్రాంతానికి పైసా సాయం చేయలేదన్నారు. ఎమ్మెల్యే సొంత గ్రామమైన ధన్వాడలోని ప్రభుత్వ పాఠశాలకు నాలుగు కుర్చీలు వేయించారా, నలుగురికి సాయం చేశారా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు గుంజపడుగు బస్టాండ్ నుంచి డప్పు చప్పుళ్లతో బారీ ర్యాలీగా వచ్చి విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం పూలే, అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేసిన విగ్రహ ఏర్పాటు కమిటి సభ్యులపై పూలవర్షం కురిపించి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అలాగే పుట్ట దంపతులను విగ్రహ ఏర్పాటు కమిటి సభ్యులతో పాటు పలువురు ఘనంగా సన్మానం చేశారు.




