Wednesday, 4 November 2026

పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలి

 

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): పెండింగ్ లో ఉన్న రూ.3300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ , ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్ నుండి కొత్త బస్ స్టాండ్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు స్కాలర్షిప్,మెస్ చార్జీలు పెంచాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.ఫీజు బకాయిల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని విమర్శించారు.ఫీజు బకాయిలు రూ.3300 కోట్లు లేవని చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం, మంత్రుల ఎమ్మెల్యేల జీతాలను పెంచుతుందన్నారు.పేద విద్యార్థుల స్కాలర్షిప్స్ పెంచరా అని ప్రశ్నించారు.పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్,మెస్ ఛార్జీలు పెంచాలన్నారు.పదో తరగతి లోపు విద్యార్థులకు వార్షిక స్కాలర్షిప్ రూ.20 వేలు ఇవ్వాలని కోరారు.బడ్జెట్ లో విద్యా రంగానికి పెద్దపీట వేయాలని, ఎన్నికల హామీ నిరుద్యోగ భృతిని అమలు చేయాలన్నారు.లక్ష ఉద్యోగాలు అని చెప్పి నామమాత్రంగా కొన్ని ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు.ప్రైవేట్ యూనివర్సిటీలను తెచ్చి విద్యార్థులను దోచుకు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఫీజు బకాయిలన్ని వెంటనే విడుదల చేయాలని,లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు బారి అశోక్ కుమార్, ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర నాయకులు నాగేంద్ర నాయక్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి వేముల రాము, జనసేన సమితి రాష్ట్ర అధ్యక్షులు తగుల జనార్ధన్ , గిరిజన శక్తి జిల్లా అధ్యక్షులు ధరావత్ వెంకటేష్ నాయక్ , జిల్లా అధ్యక్షుడు కోళ్ల కరుణాకర్, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వికాస్ రాజ్, చివ్వేంల మండల అధ్యక్షులు పరాల సాయి, భువనగిరి మహేష్ తదితరులు పాల్గొన్నారు