Monday, 2 November 2026

పెను తుపానుగా బలపడనున్న నీలం

చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘నీలం’ తుపాను పెను తుపానుగా మారింది. దీంతో చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెన్నై ఓడరేవు వద్ద ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరానికి సమీపంలో ఉన్న మత్య్సకార గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. తీరందాటే సమయంలో విధ్వంసం జరుగవచ్చుననే అనుమానంతో ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నాయి. తిరుపతిలో భారీవర్షాలు, ఈదురుగాలులతో చలితీవ్రత పెరిగింది. దీంతో స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిత్తూరుతో పాటు శ్రీకాళహస్తిలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. తంబళ్లపల్లిలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి వేరుశనగ పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చిత్తూరులోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నెల్లూరుల్లోని నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో వరినారుమళ్లు నీటమునిగాయి. కావలి, అల్లూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తడ తీరప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కోట మండలం చిట్టేడులో చలితీవ్రతకు ఓ వృద్థురాలు మృతి చెందింది. మత్సకారుల చేపల చట్టా సముద్రంలో గల్లంతైంది. అలూరు మండలం ఇసుకపల్లి వద్ద సముద్రం 100 మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చింది. ప్రకాశం జిల్లా వేటపాళెం  మండలం పొట్టిసుబ్బయ్యపాలెం వద్ద సముద్రం 25 మీటర్లు ముందుకు  చొచ్చుకువచ్చింది. చీరాల, వాడరేవు, కొత్తపట్నం తీరప్రాంతాల్లో 6వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *