Thursday, 5 November 2026

పేదల ఆకలిని అక్షరబంధం చేసిన సృజనశీలి అలిశెట్టి ప్రభాకర్.

పేదల ఆకలిని అక్షరబంధం చేసిన సృజనశీలి అలిశెట్టి ప్రభాకర్.
– సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు
బెల్లంపల్లి, జనవరి 12 (జనంసాక్షి )

పేదల ఆకలిని అక్షరబంధం చేసిన సృజనాత్మక కవి, రచయిత అలిశెట్టి ప్రభాకర్ చిరస్మరణీయుడని బెల్లంపల్లి సి ఓ ఈ ప్రిన్సిపల్ ఐనాల సైదులు అన్నారు. గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ లో లాంగ్వేజ్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి రచయిత అలిశెట్టి ప్రభాకర్ జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో పీడన, హింస తీవ్రంగా ఉన్న భూస్వామ్య గ్రామాల్లోని దయనీయమైన పరిస్థితులను, పేదల ఆకలిని అక్షరబద్ధం చేసిన గొప్ప సృజనశీలి యువకవి అలిశెట్టి ప్రభాకర్ అని అన్నారు. అలిశెట్టి ప్రభాకర్ వ్రాసిన చిన్నచిన్న కవితా ఖండికలు నాడు యువతను ఎంతో ప్రభావితం చేశాయన్నారు. పేదల జీవితాలను అక్షరబద్దం చేయడమేకాకుండా సమాజాన్ని చైతన్య పరిచాయన్నారు. 1972 నుంచి 1993 వరకు చిత్రకళ ఫోటోగ్రఫీ కవిత్వం వంటి పలు ప్రక్రియల్లో తనదైన ముద్రతో సమాజాన్ని చైతన్య పరచడంలో అలిశెట్టి ప్రభాకర్ నిరంతరం కృషి చేశారన్నారు. చిన్నవయసులోనే ఈ సమాజం నుండి భౌతికంగా దూరమైన అలిశెట్టి ప్రభాకర్ పుట్టినరోజు మరియు మరణించిన రోజు ఒకటే కావడం విశేషమన్నారు. ఆయన సాహిత్యంలో సృజనాత్మకంగా ఆలోచించి వ్రాసిన కవిత్వం చిత్రకళ నేటికీ సజీవమని అన్నారు కార్మికులు, కర్షకుల నాయకత్వంలో నూతన సమాజ సృష్టికి కావలసిన శక్తిని ఆయన కవితల్లో కనిపిస్తుంది అని అన్నారు. ఈకార్యక్రమంలో ముందుగా అలిశెట్టి ప్రభాకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో లాంగ్వేజ్ క్లబ్ అధ్యక్షులు కోట రాజకుమార్ అధ్యాపకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.