బిచ్కుంద జూన్ 22 (జనంసాక్షి) బిచ్కుంద మండలంలోని హజ్గుల్ గ్రామంతో పాటు అనేక గ్రామాల్లో రేషన్ బియ్యం పెద్దఎత్తున అక్రమ రవాణా జరుగుతోంది. ఇందులో డీలర్లదే కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పేదల ఆకలి తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. ప్రభుత్వాల ఆశయానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. అక్రమార్కులు సిండికేట్ గా ఏర్పడి రాత్రివేళ లారీలు, మినీవ్యాన్ లు, ఆటో ట్రాలీలలో పొరుగు రాష్ట్రాలకు, జిల్లాలకు రహస్యంగా తరలిస్తున్నారు. చాలాకాలంగా ఈ దందా కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రతినెలా టన్నుల కొద్ది బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్ బియ్యం తరలింపును అడ్డుకునే అధికారం ప్రజాపంపిణీ వ్యవస్థలో ప్రత్యేక అధికారులు, పోలీసులకు ఉన్నప్పటికీ ఈ దందా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని కొంతమంది దళారులు, డీలర్లు కుమ్మక్కై దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. లబ్ధిదారుల వద్ద ఓటీపి, మరికొందరి వద్ద ఫింగర్ ప్రింట్ తిస్కొని ఈ నెలలో బియ్యం అయిపోయాయి మరొక నెలలో తీసుకోండని సదరు డీలర్ చెప్పడం గమనార్హం. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యం ప్రతినెలా పక్కదారి పట్టిస్తున్న ముఠాల ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పేదల బియ్యం పక్కదారి రేషన్ డీలర్ల ఇష్టారాజ్యం




