టేకులపల్లి, ఏప్రిల్ 5( జనం సాక్షి ): నిరుద్యోగుల, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, ఇదేమని ప్రశ్నించే వారిని ద్రోహు లుగా చూస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు బానోత్ సరిలాల్ ప్రభుత్వ తీరుపై విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపుతున్నారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా జైల్లో పెట్టిందని విమర్శించారు. టిపిఎస్సిపి పేపర్ లీకేజీ ఘటన తర్వాత వికారాబాద్ జిల్లాలో పదవ తరగతి పరీక్షా పత్రం లీకేజీ అయిందని, దీనిపై పదవ తరగతి బోర్డు ముందు ఆందోళన చేసిన యూత్ కాంగ్రెస్ విషయంలో తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం శివసేనారెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిందని ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మళ్ళీ వరంగల్ జిల్లాలో పదవ తరగతి హింది ప్రశ్న పత్రం లీకేజీ అయ్యిందని అన్నారు. అసలు ఈ ప్రభుత్వం లీకుల ప్రభుత్వం అని అన్నారు. వరుస లీకులతో ప్రజల జీవితాలతో, విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. వరుస లీకేజీలపై బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శివసేనారెడ్డిని అరెస్టు చేసినంత మాత్రాన తమ యూత్ కాంగ్రెస్ పోరు ఆగదని, 7 రోజులపాటు శివసేనారెడ్డిని రిమాండ్ కు తరలించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ కుట్రకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.




