Wednesday, 4 November 2026

పోలీసులకు ప్రోత్సాహక బహుమతులు

కోడికత్తి కేసును వదలబోమన్న చినరాజప్ప

అమరావతి,నవంబర్‌5(జ‌నంసాక్షి): క్లిష్టమైన కేసులను ఛేదించిన పోలీసు అధికారులకు ¬ంమంత్రి చినరాజప్ప, డీజీపీ ఠాకూర్‌ అవార్డులు, రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ పోలీసులను ప్రోత్సహిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని, ఎంత బాగా పనిచేస్తున్నప్పటికీ ప్రతిపక్షం విమర్శిస్తూనే ఉందని ఆరోపించారు. పారదర్శకంగా అవార్డుల ప్రకటించామని, అవార్డుల కమిటీలో సీఐడీ స్థాయి అధికారి ఉన్నారని ఠాకూర్‌ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసులు పరిష్కారం అవుతున్నాయని, రాబోయే రోజుల్లో ఫేస్‌ రికగ్నైజ్‌ టెక్నాలజీని తీసుకొస్తామని ఠాకూర్‌ తెలిపారు. కోడికత్తి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని మంత్రి చినరాజప్ప చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్‌కు సానుభూతి రావాలనే దాడి చేశానని నిందితుడు చెప్పాడని, విచారణకు జగన్‌ సహకరించడం లేదని ఆరోపించారు. కోడికత్తి కేసును దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని కూడా కోరామని తెలిపారు. రాష్ట్రంలో నాటకాలు ఆడే వారు ఎక్కువయ్యారని, పవన్‌ కొత్తగా సమాజాన్ని మార్చాల్సిన అవసరం లేదన్నారు. చిరంజీవి పార్టీ పెట్టి పదవుల కోసం కాంగ్రెస్‌లో విలీనం చేశారని, భవిష్యత్‌లో పవన్‌ ఎలా వ్యవహరిస్తారో ఇప్పుడే చెప్పలేమని చినరాజప్ప అభిప్రాయపడ్డారు.