Tuesday, 3 November 2026

పోలీసులు బీఆర్ఎస్ కు ఏజెంట్లుగా పనిచేయొద్దు శాంతి భద్రతలు కాపాడాల్సిన వారే విఘాతం కలిగిస్తున్నారు – ఐసీసీ సెక్రెటరీ, ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆగ్రహం

జనంసాక్షి, మంథని :ఖమ్మంలో నేడు నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ జనగర్జన భారీ బహిరంగ సభ కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు రాకుండా పోలీసులు ఎక్కడికి అక్కడ ప్రైవేట్ వాహనాలు అడ్డుకొని సీజ్ చేయడం సరికాదని ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఖమ్మం నుంచి శ్రీధర్ బాబు మీడియా తో మాట్లాడారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే వాటికి విఘాతం కల్పించడం శోచనీయమన్నారు. పోలీసులు నిజాయితీగా వ్యవహరించాలి తప్ప బీఆర్ఎస్ కు ఏజెంట్లుగా పనిచేయొద్దు…!అని సూచించారు. తమ నాయకుడు, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేపట్టిన దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకోవడం, పెద్ద ఎత్తున చేరికలు ఉండడంతో ఖమ్మంలో సభ నిర్వహిస్తున్న తరుణంలో ఈ సభకు విఘాతం కలిగించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయని ఆరోపించారు. పోలీసులు అడుగడుగునా తమ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని, సభకు రాకుండా ఇప్పటికే ఆర్టీసీ బస్సులను ఇవ్వని బీఆర్ఎస్ సర్కార్.. ప్రైవేటు వెహికల్స్ ని కూడా రానివ్వకుండా చెక్ పోస్టులు పెట్టి పోలీసులతో వాహనాలను సీజ్ చేస్తున్నారని అన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ సభకు వెళ్తే గ్రామాలలో సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఎన్ని అడ్డంకులు సృష్టించిన సభ ఆగదు అని, తమ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ తట్టుకోలేరన్నారు. అన్నీ గమనిస్తున్నాం… ఇప్పటికైనా తమ సభకు అడ్డంకులు సృష్టించొద్దని పోలీసులను కోరుతున్నామన్నారు