Wednesday, 4 November 2026

ప్రచారంలో దూసుకుని పోతున్న గులాబీ నేతలు

ఇంటింటా ప్రచారంతో ఆకట్టుకునే ప్రయత్నం

అభివృద్ది కొనసాగాలంటే కెసిఆర్‌ సిఎం కావాలని ప్రచారం

హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ అబ్యర్థులు ప్రచారంలో దూసుకుని పోతున్నారు. వివిధ ప్రాంతాల్లో వారు తమ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేపట్టారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని

కొల్గూరులో మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గజ్వేల్‌లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గం అభ్యర్థి రాంమోహన్‌ గౌడ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వనస్థలిపురం డివిజన్‌లో కార్యకర్తలతో ర్యాలీ చేపట్టారు. ఎక్కడికి వెళ్లిన ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వానికే ఓటు వేస్తామని హావిూ ఇస్తున్నారని అన్నారు. ప్రజలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలుగున్నరేండ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేఖా నాయక్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటి ఎన్నికల ప్రచారంలో చేస్తు ఓట్లు అభ్యర్థించారు. గ్రామస్తులు మంగళ హారతులతో స్వాగతం పలికి.. ఆమెను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నాలుగేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు తాజా మాజీ ఎమ్మెల్యే, అభ్యర్థిని అజ్మీర రేఖాశ్యాం నాయక్‌. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆమె ప్రచారానికి గ్రామంలో అపూర్వ స్పందన లభించింది. ఎక్కడ చూసినా జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని జగనామలో ముత్తిరెడ్డి యాదగిరి అన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. . రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం రూ. 10 వేలకు పెంచుతామన్నారు. పేద రైతులు చనిపోతే రైతు బంధు బీమా పథకం కింద పరిహారం అందిస్తున్నామని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు అందిస్తున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ నేతలు అభివృద్ధి పనులు చేస్తుంటే.. కాంగ్రెస్‌ అడ్డుకుంటుందని ధ్వజమెత్తారు.

కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా రెబ్బెనలో మండలంలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రైతుబంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడా లేదని అన్నం పెట్టే రైతు.. కంటతడి పెట్టవద్దని సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని తీసుకు వచ్చారని ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కుమార్‌ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని అన్ని ప్రజలు అన్ని వర్గాల వారు కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని హావిూ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై.. ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలు మరియు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 200 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.