Monday, 2 November 2026

ప్రచారాన్నిముమ్మరం చేసిన బిజెపి

ప్రముఖ నేతలతో ప్రచారం
3న హైదరాబాద్‌లో ప్రధాని బహిరంగ సభ
హైదరాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఎన్నికల్లో ప్రధానంగా దృష్టి పెట్టింది. ప్రధాని మొదలు ప్రముఖులంతా ఇక్కడే తిష్టవేసి ప్రచారం ముమ్మరం చేశారు. తెలంగాణలో బిజెపికి పెద్దగా అవకాశాలు లేకున్నా స్టార్‌ క్యాంపెయినర్ల ప్రచారం జోరుగా సాగుతోంది. మరికొంత మంది కీలక నేతలను ఆ పార్టీ రంగంలోకి దించనుంది. ఇప్పటికే ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ బహిరంగ సభల్లో పాల్గొనగా, అమిత్‌షా 9 నియోజకవర్గాల్లో బహిరంగసభలు, రోడ్‌షోల ద్వారా ప్రచారం చేశారు. మరింత శ్రద్ద పెట్టి మరికొందరు కేంద్ర నాయకులు రానున్నారని సమాచారం. తెలంగాణలో బలం చాటాలన్న కాంక్షతో  ప్రత్యేక దృష్టి సారించిన అధినాయకత్వం నియోజకవర్గాల్లో స్టార్‌ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కేంద్ర ఆరోగ్యమంత్రి జగత్‌ప్రకాశ్‌ నడ్డా హైదరాబాద్‌లోనే మకాం వేసి, పార్టీ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించడంతోపాటు రోజువారీ ప్రచారాన్ని పరిశీలిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, సాధ్వి నిరంజన్‌ జ్యోతి, సంతోష్‌ గంగ్వార్‌, పార్టీ సీనియర్‌ నేతలు మురళీధర్‌రావు, రాంమాధవ్‌, పురంధేశ్వరి, స్వామి పరిపూర్ణానంద వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా సభల్లో వీరు పాల్గొన్నారు. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ మేడ్చల్‌ అభ్యర్థి మోహన్‌రెడ్డి తరఫున ప్రచారం చేశారు. పరిపూర్ణానంద  ఇప్పటికే పదుల సంఖ్యలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా, మరిన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు
సిద్ధమవుతున్నారు. 5వ తేదీ వరకు నిర్వహించే బహిరంగ సభలు తమకు ఎంతో కీలకమైనవని బీజేపీ పేర్కొంటోంది. ఈ నెల 3న హైదరాబాద్‌లో నిర్వహించే ప్రధాని మోదీ సభ తరువాత తెలంగాణలో పరిణామాలు మారుతాయని, బీజేపీకి మరింత అనుకూల పరిస్థితి ఏర్పడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.  ఈ నెల 2 న అమిత్‌షా నారాయణ్‌పేట్‌, కల్వకుర్తి , కామారెడ్డి బహిరంగసభలు, ఉప్పల్‌, మల్కాజిగిరి రోడ్‌ షోలలో పాల్గొననున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ 2న భూపాలపల్లి, ముధోల్‌, బోధన్‌, తాండూరు, సంగారెడ్డిలో, 5న కరీంనగర్‌, వరంగల్‌, గోషామహల్‌లో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొననున్నారు. 4న కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, రవిశంకర్‌ ప్రసాద్‌ల సభలు నిర్వహించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌ భద్రాచలం, ఎల్లారెడ్డి, ఖైరతాబాద్‌ బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్నికలు ముగియిడంతో ఇక రాజస్థాన్‌, తెలంగాణలపై బిజెపి నేతలు దృష్టి సారించారు. నేరుగా కెసిఆర్‌ను, కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రచార ఉధృతిని పెంచారు. రద్దయిన అసెంబ్లీలో బిజెపికి ఐదు సీట్లు ఉండగా వాటిని కనీసం 29కి పెంచాలని ఆరాటపడుతున్నారు. అందుకే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి దింపారు.