Tuesday, 3 November 2026

ప్రజలను ఓట్ల కోసమే వాడుకుంటున్న దుద్దిళ్ల కుటుంబం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

జనంసాక్షి, మంథని : బ్రాహ్మణీయ పాలనలో మనకు మిగిలేది బాంచెన్‌ బతుకులేననే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని మంథని నియోజకవర్గ భిఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని మండలం అడవి సోమన్‌పల్లి సమీపంలోని మానేరు నదిలో నిర్మించిన చెక్‌డ్యాంను ఆయన పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తండ్రి ఆశయాల పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన మంథని ఎమ్మెల్యే తండ్రి ఆశయాలేంటో చెప్పడం లేదని, ఈ ప్రాంత ప్రజలను చీకట్లో ఉంచడమే తండ్రి ఆశయాలని అర్థం అవుతోందన్నారు. ఆనాడు తండ్రి, ఈనాడు తనయుడు నియోజక వర్గానికి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. మంథని నియోజకవర్గాన్ని ఆనుకుని గోదావరి, మానేరు నదులు ప్రవహిస్తున్నా వృధాగా పోయే నీటిని వినియోగంలోకి తీసుకు రావాలని ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా ప్రజాప్రతినిధిగా ఎన్నికై అడవిసోమన్‌పల్లి సమీపంలో చెక్‌ డ్యాం నిర్మించుకున్నామని, ఖమ్మంపల్లి మానేరుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకున్నామని, ఓడేడ్‌ వద్ద బ్రిడ్జి నిర్మాణం జరుగుతోందని, అలాగే ఓదాల, గోపాల్‌పూర్‌, అడవిశ్రీరాంపూర్‌, ఓడేడ్‌ వద్ద మానేరుపై చెక్‌డ్యాం నిర్మాణం చేసుకున్నామని తెలిపారు. మానేరు నీరు వృధాపోకుండా చెక్‌డ్యాంల ద్వారా ఒడిసిపట్ట ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, చెక్‌డ్యాంలతో భూగర్బజలాలు పెరిగి వ్యవసాయం చేసే రైతులకు ఎంతోఉపయోగపడుతున్నాయని ఆయన చెప్పారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్లుప్రజాప్రతినిదిగా అయితే ఈ ప్రాంతంపై చిత్తశుద్దితో పనిచేస్తారని, ఇందుకు అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాం నిదర్శనమన్నారు. 40 ఏండ్లతో ఏనాడు ఇలాంటి ఆలోచన చేయని తండ్రి కొడుకులు ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతూ మోసం చేస్తూనే ఉన్నారని, అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని వాడుకుని అభివృద్ది చెందాల్సిన ఈప్రాంత ప్రజలను ఎన్నికల సమయంలో మాయమాటలకు ఓట్లు వేసి మోసపోతున్నారని, మళ్లీ మోసపోకుండా వారిలో అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలన్నదే తన ప్రయత్నం అన్నారు. అంతేకాకుండా పచ్చి అబద్దాలకు నిలువెత్తు నిదర్శనం మంథని ఎమ్మెల్యే అని ఆయన ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌పార్టీ గెలిచిందని మంథని నియోజకవర్గంలో సంబరాలు చేసుకున్న ఎమ్మెల్యే కాటారం సెంటర్‌లో నిలబడి నేషనల్‌ హైవేను తానే తీసుకువచ్చానని, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఎనిమిది లైన్లరోడ్‌ తీసుకురావాలని మాట్లాడితీరు విడ్డూరంగా ఉందన్నారు. మహదేవ్‌పూర్‌ నుంచి భూపాలపల్లి వరకు 2017లో నేషనల్‌ హైవే మంజూరైతే 2018లో టెండర్లు పూర్తయి 2020లో రోడ్డు నిర్మాణం పూర్తయిందని, ఆ సమయంలో అధికారంలో లేని ఎమ్మెల్యే నేషనల్‌ హైవే తెచ్చానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. చదువుకున్న కుటుంబంలో జన్మించిన ఎమ్మెల్యే చదువుకోని వారిలా అబద్దాలు ఆడటాన్ని చూసే రేపట సమాజం ఆస్యహించుకుంటుందన్నారు. 40ఏండ్లుగా మన ఓట్లతో అధికారంలోకి వచ్చి అమెరికా, హైదరాబాద్‌, బెంగళూర్‌లాంటి పట్టణాల్లో ఆస్తులు కూడబెట్టుకుని కుటుంబంతో సంతోషంగా ఉంటున్నారే కానీ ఏనాడు ఈ ప్రాంత ప్రజల ఆకలి తీర్చాలని, అంటరాని తనాన్నినిర్మూలించాలని ఆలోచన చేయలేదని విమర్శించారు. 75ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత అగ్రబాగాన పరిపాలన చేసిన దుద్దిళ్ల కుటుంబం ఇప్పటి వరకు మంథని అంబేద్కర్‌నగర్‌లో ఏ ఇంటిలో బ్రాహ్మణులతో పురోహితం చేయించి గౌరవించిన సందర్బాలు లేవన్నారు. దుద్దిళ్ట కుటుంబం ఉన్నన్నిరోజులు మనకు అన్నం దొరుకదనే విషయాన్నిప్రజలు గుర్తించాలని, కసాయి కుటుంబాన్ని ఓటుతో తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేసి మన ఓట్లతో అధికారంలోకి వచ్చి మన ఆకలి తీర్చని వాళ్లు ఎవరో గమనించాలని ఆయన స్పష్టం చేశారు.