17న ఆలేరులో నామినేషన్ వేస్తా!
మోత్కుపల్లి నర్సింహులు
హైదరాబాద్, నవంబర్10(జనంసాక్షి) : ఆలేరు నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని గోదావరి జలసాధన సమితి చీఫ్, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు. శనివారం ఆయన నియోజకవర్గంలోని తిరుమలాపూర్, గంధమల్ల, వీరారెడ్డిపల్లి, ఇబ్రహీంపూర్, దత్తాయపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ.. తాను ఏ ఊరికి వెళ్లినా ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారనీ, ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఇప్పటివరకూ ఎనిమిది మండలాల్లోని 200 గ్రమాల్లో పర్యటించానని మోత్కుపల్లి తెలిపారు. రాష్ట్రంలో అసమర్థపాలన సాగుతుందని మోత్కుపల్లి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తివ్యతిరేకత ఉందన్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశానని వెల్లడించారు. మరోసారి అవకాశం ఇస్తే గోదావరి జలాలను తీసుకొచ్చి ప్రజల కాళ్లు కడుగుతానని వ్యాఖ్యానించారు. భూకబ్జాదారులు, దందాలు నిర్వహించే వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికై ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించారన్నారు. ఈ నెల 17న తాను నామినేషన్ దాఖలు చేస్తున్నాననీ, ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని ప్రజలను మోత్కుపల్లి కోరారు. ఇదిలాఉంటే మోత్కుపల్లి టీడీపీ నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఈ తరుణంలో ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. అందుకు ఊతమిస్తూ మోత్కుపల్లి కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆలేరు టీఆర్‌ఎస్ నుంచి మోత్కుపల్లికి అవకాశం కల్పిస్తారని అందరూ భావించారు. చివరి నిమిషంలో ఆలేరు టికెట్‌ను టీఆర్‌ఎస్ సిట్టింగ్ అభ్యర్ధికే కేటాయించడంతో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మోత్కుపల్లి దూరం జరిగారు. అనంతరం తానే స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుతానని తెలిపారు. దీనిలో భాగంగా ఈనెల 17న నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.
ప్రజల కోరిక మేరకే పోటీ చేస్తున్నా




