Friday, 6 November 2026

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

మహబూబాబాద్ బ్యూరో-నవంబర్14(జనంసాక్షి)

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ తో కలిసి కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిష్కరించుటకు వీలున్న వాటిని వెంటనే పరిష్కరించాలని, వీలుకాని సందర్భంలో దరఖాస్తులను జాప్యం చేయకుండా తిరస్కరిస్తూ, తిరస్కరణ విషయమై లబ్దిదారులకు వివరణ ఇవ్వాలని, తమ దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు. అలాగే దరఖాస్తులు పరిష్కరించిన తర్వాత ప్రజావాణి ఆన్లైన్ లో వివరాలు నమోదు చేయాలని తెలియజేశారు. కేసముద్రం మండలం అమీనాపూర్ గ్రామానికి చెందిన రైతు మందల కృష్ణమూర్తి తన వ్యవసాయ భూమిని సర్వే చేసి పట్టా దారు పాసు పుస్తకాన్ని ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు. దంతాలపల్లి మండలకేంద్రానికి చెందిన సోమారపు నర్సయ్య జీవన భృతి కై చెప్పుల దుకాణం పెట్టుకొనుటకు ఎస్సి కార్పోరేషన్ ద్వారా ఋణ సహాయం అందించాలని దరఖాస్తు అందజేశాడు. కురవి మండలం బలపాల గ్రామానికి చెందిన గోల్కొండ హేమలత వితంతు పెన్షన్ కొరకు దరఖాస్తు అందజేశారు. చిన్న గూడూరు మండలం విస్సంపల్లి గ్రామానికి చెందిన మోర నర్సమ్మ తన భర్త కరోనా పాజిటివ్ వచ్చి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించగా మరణ దృవీకరణ పత్రం కొరకు దరఖాస్తు చేసుకున్నానని, త్వరితగతిన ఇప్పించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత అధికారులకు పంపించి పరిశీలించిన అనంతరం న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో (78) దరఖాస్తులు స్వీకరించారు.