Wednesday, 4 November 2026

ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖిమ్యా నాయక్

 

రాజన్నసిరిసిల్లబ్యూరో.,ఏప్రిల్.24.(జనంసాక్షి). ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులకు సంబంధిత అధికారులు స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖిమ్యా నాయక్ ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని అన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలించి, అట్టి దరఖాస్తులకు సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గం చూపాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 26 ఫిర్యాదులు, వినతులు వచ్చినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి కార్యక్రమంలో వేములవాడ ఆర్.డి. వో. పవన్ కుమార్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు