సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): గత 28 రోజులుగా సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజాపోరు యాత్రకు రాష్ట్ర కమిటీ తరుపున మద్దతు తెలుపుతూ జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటాలు ఉదృతం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు అన్నారు.గత ఎనిమిదేళ్ళ నుండి పట్టణంలో ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఇళ్ల స్థలాలు, ఇండ్లు లేక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఇబ్బందులు చూసి తమ పార్టీ ఆధ్వర్యంలో సర్వేనెంబర్ 126లో పేదలతో కలిసి గుడిసెలు వేస్తే తమ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేశారని అన్నారు.ఇదే విషయం మంత్రి , జిల్లా కలెక్టర్ కు అనేక సార్లు చెప్పామని, నేటికి ఎలాంటి స్పందన లేదన్నారు.కేసులకు భయపడే పార్టీ తమది కాదని, సమస్య ఏదైనా ఎదుర్కొని ప్రజల పక్షాన ఉంటామన్నారు .మంత్రి, జిల్లా కలెక్టర్ స్పందించి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.లేని పక్షంలో ఇంటి స్థలాలు ఇచ్చేంతవరకు పోరాడుతామన్నారు.గత 28 రోజులుగా చేపట్టిన ప్రజాపోరు యాత్రలో అనేక ప్రజా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు.అభివృద్ధి పనుల్లో ఆలస్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు.తక్షణమే ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు నాగన్న, నరసన్న,లక్ష్మన్న , ఐఎఫ్టీయు జిల్లా కార్యదర్శి రామోజీ, రేణుక, చంద్రకళ, జయమ్మ, పరుశురాం, సునీల్, వీరబాబు, సింహాద్రి , శైలజ, పద్మ తదితరులు పాల్గొన్నారు.




