Tuesday, 3 November 2026

ప్రజా వ్యతిరేక పాలనను సమాధి చేద్దాంప్రజా సమస్యలపై పాలకులకు పట్టింపు లేదువేమనపల్లి మండలంలో సిపిఐ ప్రజా పోరు యాత్ర ప్రారంభోత్సవంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ 

 

 

 

 

వేమనపల్లి,ఏప్రిల్ 27, (జనంసాక్షి):దేశంలో నిరుద్యోగం,ఆకలి చావులు, మతోన్మాద దాడులు,ప్రైవేటీకరణ,ప్రజా,కార్మిక,కర్షక, యువత,విద్యార్థి వ్యతిరేక పాలన సాగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు.వేమనపల్లి మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌ రేగుంట చంద్రశేఖర్‌ నేతృత్వంలో చేపట్టిన 10వ రోజు సిపిఐ ప్రజా పోరుయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,నియోజకవర్గ సహాయ కార్యదర్శి మామిడాల రాజేశం పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు సిపిఐ చేస్తున్న ప్రజా పోరు యాత్రను ప్రజలు ఆదరించాలని కోరారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని,బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి గోదావరి నీరు అందించాలని అన్నారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ప్రతి ఎకరానికి సాగునీరు,అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు,పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు.కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌,నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుల బతుకులను అస్తవ్యస్థం చేసిందని, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అనేక మంది బతుకు భారమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో నిత్యం నిరుద్యోగ సమస్య పెరుగుతుందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నారన్నారు. ఉద్యోగులను, కార్మికులను బానిసలుగా చేసేందుకు చట్టాలను రద్దు చేసి కార్మిక లేబర్‌ కోడ్‌లను రూపొందించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.చాప కింద నీరులా మతోన్మాద శక్తులు దేశంలో రాజ్యమేలాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రజలు పోరాటాలకు సిద్దంగా ఉండాలన్నారు.ఈ పోరు యాత్రలో ప్రజా సంఘాలు,మేధావులు,ప్రజలు,కార్మికులు, కర్షకులు,యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అందే పురుషోత్తం,బొంతల లక్ష్మీ నారాయణ,గుండ చంద్ర మాణిక్యం, బియ్యాల ఉపేందర్,అడెపు రాజమౌళి,కొంకుల రాజేష్,దెవరబోయిన చిన్న శంకర్, దేవరబోయిన బాపు,శీలం చంద్రయ్య ,రత్నం రాజం,బండారి శంకర్,వినోద్,అందే మహేష్,ప్రజానాట్యమండలి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.