Wednesday, 4 November 2026

ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపు – భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం

ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపు – భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం
హుజూర్ నగర్ జనవరి 7 (జనంసాక్షి): భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం పోంచర్ల (హుజుర్ నగర్) నియోజకవర్గ కేంద్రంలో జరిగిన పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో అసెంబ్లీ పాలక్ దాసరి మల్లేశం, ప్రభారీ కర్నాటి దనుంజయ, జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బోబ్బా భాగ్యరెడ్డి మాట్లాడుతూ పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలన్నారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇద్దరూ ఒక్కటేనని వారిని నియోజకవర్గ ప్రజలు ఏవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. అసెంబ్లీ పాలక్ దాసరి మల్లేశం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశంలోనే అత్యధిక కార్యకర్తల బలం ఉన్న పార్టీ అని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు. రాబోయే రోజుల్లో హుజుర్ నగర్ నియోజకవర్గంలో కాషాయ జండా ఎగురుతుందని, త్వరలో హుజుర్ నగర్ లో 20,000 వేల మంది కార్యకర్తలతో సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభారీ కర్నాటి దనుంజయ మాట్లాడుతూ ఎన్నికలు అయ్యేంత వరకు ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపు కోసం అన్నివేళలా పని చేయాలని అన్నారు. అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న కేసీఆర్ అవినీతి పాలనను, ప్రభుత్వ వైఫల్యంను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. రాష్ట్రంలో, హుజుర్ నగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం అని అన్నారు. ప్రతి ఒక్క కార్యకార్త సరళ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. బిజెపి యొక్క 6359119119 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి ప్రతి కార్యకర్త తమ మద్ధతు తెలపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధ్యక్షులు, మండల బూత్ అధ్యక్షులు, బూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.