Thursday, 5 November 2026

ప్రజా సమస్యల పరిష్కార దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు

 

 

 

 

 

 

మెదక్, మే 15, 2023జనం సాక్షి ప్రతినిధి మెదక్. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 68 వినతులు స్వీకరించారు. ఇందులో ప్రధానంగా ధరణి,భూ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి 38 వినతులు రాగా వివిధ శాఖలకు సంబంధించి మరో 30 వినతులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు సమర్పించే దరఖాస్తులపై అధికారులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించి పరిష్కార దిశగా కృషి చేయాలన్నారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కారమయ్యేలా సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయాలని అప్పుడే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని అన్నారు.
అనంతరం అధికారులతో వివిధ కార్యకమాలను సమీక్షిస్తూ గ్రామ పంచాయతీలకు సంబంధించి బిల్లులు క్లియర్ అయినందున మిగతా పనులు వేగిరం చేయాలన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పధకం క్రింద అన్ని పనులు మొదలు పెట్టేలా సర్పంచులను, స్కూల్ మేనేజిమెంట్ కమిటీని ప్రోత్సహించాలని అన్నారు . వైకుంఠ ధామాలలో చేతి పంపుల ఏర్పాటు, మోటార్ల బిగింపు, విద్యుత్ సౌకర్యం కల్పించి అన్ని వినియోగంలో తెచ్చేలా జిల్లా పంచాయతీ, విద్యుత్ శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అదేవిధంగా మిగిలిపోయినా తెలంగాణాకు క్రీడా ప్రాంగణాలు సత్వరమే ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. మండలాలలో ఏర్పాటు చేస్తున్నసమావేశాలల్లో వివిధ పనుల పురోగతిని సమీక్షిస్తూ పనులు పరుగుపెట్టించాలని అన్నారు. ప్రతి మండల ప్రత్యేకాధికారి వారంలో కనీసం రెండు కంటి వెలుగు శిబిరాలను, మంగళ వారం ఆరోగ్య మహిళా కేంద్రాన్ని సందర్శించి మెరుగ్గా శిబిరాలు నిర్వహించేలా పర్యవేక్షించాలన్నారు. సోమవారం నుండి బుధవారం వరకు మండల స్థాయిలో నిర్వహించే సి.ఏం. కప్-2023 విజయవంతానికి కృషిచేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వానాకాలంలో రైతులకు ఎరువుల కొరత రాకుండా రేక్ పాయింట్ ద్వారా ఎరువుల రవాణా, గోదాములలో భద్రపర్చుటపై పర్యవేక్షణ చేస్తుండాలి జిల్లా వ్యవసాయాధికారి సూచించారు. రైతులు ఎఫ్.ఏ.క్యూ. నిబంధనల మేరకు నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా వ్యవసాయ విస్తరణాధికారులు అవగాహన కలిగించాలన్నారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు వెంకట శైలేష్, శ్రీనివాస్, జయరాజ్, విజయ శేఖర్ రెడ్డి, కృష్ణ మూర్తి, జెంలా నాయక్, రవి ప్రసాద్, రాధాకిషన్, కమలాకర్, ,సాయిబాబా, శంకర్, రజిని, విజయలక్ష్మి, ఆశా కుమారి, బ్రహ్మాజీ , కరుణ, ఇందిర, డా.నవీన్, ,కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్ తదితరులు పాల్గొన్నారు.