Sunday, 8 November 2026

ప్రతి విద్యార్థి రామానుజన్ స్ఫూర్తిగా తీసుకొని గణితంలో పట్టు సాధించాలి

ప్రతి విద్యార్థి రామానుజన్ స్ఫూర్తిగా తీసుకొని గణితంలో పట్టు సాధించాలి

బెటాలియన్ కమాండెంట్ రాంప్రకాష్

ఇటిక్యాల (జనంసాక్షి) డిసెంబర్ 22 గణితంలో ఎటువంటి అధికారిక విద్యను పొందని రామానుజన్ గణితరంగానికి విశేషమైన కృషి చేశారని బీచుపల్లి పదవ పటాలం కమాండెంట్ రాంప్రకాష్ అన్నారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలోని బీచుపల్లి పదవ బెటాలియన్ పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతినిఘనంగా నిర్వహించారు. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో గణిత ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని కమాండెంట్ రాంప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ రాంప్రకాష్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్లు విద్యార్థులు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఆధునిక గణిత శాస్త్రం సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు దృష్టి సారించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని కమాండండ్ అన్నారు. ఎగ్జిబిషన్లు నిర్వహించడం వల్ల సైన్స్ మన చుట్టూ ఉన్నదన్న భావన విద్యార్థులలో కలుగుతుందని ఇది విద్యార్థులకు ఎంతనో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. శ్రీనివాస రామానుజన్ 120 గణిత సిద్ధాంతాలు ప్రస్తావించి ఒక ప్రొఫెసర్ కు లేఖ పంపడంతో ప్రయాణం ప్రారంభమైందని దాని ద్వారానే శ్రీనివాస రామానుజన్ అనంతాన్ని తెలిసిన వ్యక్తిగా గుర్తింపు పొందారని కమాండెంట్ అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నాగభూషణం, ఆర్ ఐ లు రాజేష్, రమేష్ బాబు, శ్రీధర్,పాఠశాల సిబ్బంది విద్యార్థి విద్యార్థినీలు పాల్గొన్నారు. అలాగే ఎర్రవల్లి సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాలలో ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గణిత విభాగాలలోని విషయాలను ఎగ్జిబిషన్ రూపంలో రూపొందించి క్షుణ్ణంగా వివరించారు.గణిత విశేషాలను వివరిస్తూ నిర్వహించిన కార్యక్రమ ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాలలో విద్యార్థులకు గణిత విభాగాలపై క్విజ్ పోటీలు నిర్వహించి క్విజ్ కార్యక్రమాలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయులు సంధ్యారెడ్డి, వెంకటేశ్వరరావు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థి తదితరులు పాల్గొన్నారు.