ప్రతీ కార్యకర్త కుటుంబానికి టిఆర్ఎస్ ప్రభుత్వం అండ
– పేదల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ నవంబర్ 26 (జనంసాక్షి): ప్రతీ కార్యకర్త కుటుంబానికి టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీ నగర్ కాలనీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఇనుకుర్తి అనిల్ కుమార్ వారి అనుచరులు 20 మంది ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేతులు మీదుగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిదేండ్లుగా రాజకీయాలకతీతంగా జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రైతులకు నిరంతరం కరెంట్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. రైతులకు అండగా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొంది, మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు. గ్రామాల్లో గతంలో అడుగంటిన చెరువులన్నీ ప్రస్తుతం జలకళ తో దర్శనమిస్తున్నాయని అన్నారు. అనేక గ్రామాల్లోనూ ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందుతున్నదని అన్నారు. ప్రతీ పల్లెకు పక్కా రోడ్డును నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ,
నిబద్ధతతో హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రతీ కార్యకర్త కుటుంబానికి టిఆర్ఎస్ ప్రభుత్వం అండ – పేదల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి




