ప్రధాని మోడీ నోట సిరిసిల్ల చేనేత కళాకారుడి మాట..!
సిరిసిల్ల చేనేతకు అరుదైన గౌరవం.
జి 20 దేశాల సదస్సు లోగోను చేతిమగ్గంపై నేసిన కళాకారుడు వెల్ది హరిప్రసాద్
రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 27. (జనం సాక్షి) సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభ అపూర్వమైనది. దేశాల సరిహద్దులు దాటి విశ్వవ్యాపితం అయ్యింది. సిరిసిల్ల చేనేత కళాకారులు తమ ప్రతిభతో అనేక అద్భుతాలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఇప్పటికే చేనేత కళలో అనేక అద్భుతాలను ఆవిష్కరించారు. హరిప్రసాద్ రూపొందించిన సూక్ష్మ కళారూపాలు విశ్వవ్యాప్తంగా జ్ఞాపకాల రూపంలో ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. సూది దబ్బనంలో దూరే చీరలను చేతిమగ్గంపై హరిప్రసాద్ నేశారు. తొలిసారిగా ధరించడానికి అనవుగా సూది బెజ్జల్లో దూరే చీరలను నేసింది కూడా హరిప్రసాద్. తాజాగా దేశ ప్రధాని మోడీ చేత శభాష్ అనిపించుకున్నారు హరి ప్రసాద్. ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతున్న జీ 20 సదస్సు లోగోను వెల్ది హరిప్రసాద్ చేతి మగ్గంపై రూపొందించారు. మన్ కి బాత్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ హరిప్రసాద్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
సాధారణ చేనేత కుటుంబం నుంచి తాను ఎంచుకున్న చేనేత రంగంలోని అద్భుతాలను ఆవిష్కరిస్తూ ప్రధాని నోట సిరిసిల్ల కళాకారుడిగా ప్రశంసలు పొందడం పట్ల సిరిసిల్ల పట్టణ వాసులు హర్ష వ్యక్తం చేస్తున్నారు




