హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు, ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని తెరాస శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ మండిపడ్డారు. సమర దీక్షకు ర్యాలీగా వెళ్లేందుకు అసెంబ్లీకి చేరుకున్న తెరాస ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో నేతలు గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ మా గడ్డపై మా సభలకు అనుమతివ్వరా? అంటూ ప్రశ్నించారు. నిన్న రాత్రి నుంచి తెరాస నేతలు, విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారని అన్నారు. పోలీసు నిర్బంధాలను చేదిస్తామని, సమర దీక్షను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చి తెలంగాణ సాధిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రకటించకపోతూ ఈప్రాంత మంత్రులు ఏం చేస్తారో చెప్పాలని మరో నేత జూపల్లి డిమాండ్ వ్యక్తం చేశారు.




