విద్యవసతులుప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్యవసతులు
మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం అబ్రహం
ఇటిక్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 1 :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో కార్పోరేట్ స్థాయి విద్య వసతులను కల్పించి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నదని అలంపూర్ నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ వి. ఎం అబ్రహం అన్నారు. బుధవారం మండల పరిధిలోని రాజశ్రీ గార్లపాడు గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధి హామీ పథకం, మన ఊరు మనబడి నిధుల నుంచి నూతనంగా నిర్మించిన పాఠశాల పనులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం, జడ్పీ చైర్మన్ కె. సరిత, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మొదలుపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం జిల్లాలో 160 పాఠశాలను మొదటి విడతగా ఎంపిక చేసి, ఉపాధి హామీ పథకం ద్వారా టాయిలెట్లు, వంట గదులుతో పాటు తదితర పనులను పూర్తిచేయడం జరిగిందన్నారు. విద్యాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులందరూ పాటుపడాలని, అప్పుడే గ్రామాలు సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందన్నారు. ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టి జిల్లాలోని అనేక పాఠశాలలకు అన్ని సదుపాయాలు కల్పించిందని, ఇది చారిత్రాత్మక గట్టమని వారన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిందుతున్నట్లు తెలిపారు. జిల్లాలో మొదటి విడతగా రాజశ్రీ గార్లపాడు గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి పాఠశాలకు వెళ్లి క్రమశిక్షణ చదువుకోవాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా రాజశ్రీ గార్లపాడు గ్రామానికి రూ. 7.660 లక్షలు మంజూరు చేసి అన్ని వసతులు పాఠశాలకు సమకూర్చినట్లు వారు తెలిపారు. ఉపాధ్యాయులు బాధ్యతగా పాఠశాలకు హాజరై విద్యాబోధన చేయాలని వారు ఆదేశించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. సెలవులు వస్తే పాఠశాల ఆవరణలో ఎలాంటి చెత్తాచెదారం ఉండకుండా, ఇతరులు ఎవ్వరు కూడా కాంపౌండ్ లోకి రాకుండా గ్రామస్తులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సిరాజుద్దీన్, పంచాయతీరాజ్ ఎస్సీ శివకుమార్, మండల విద్యాధికారి రాజు, పంచాయతీరాజ్ డి ఈ సలాం, స్థానిక సర్పంచు పద్మ, ఎంపిటిసి మల్లేష్, విద్యా కమిటీ చైర్మన్ ఇస్మాయిల్, ప్రధానోపాధ్యాయులు ఖరేందర్ నాథ్, పంచాయతీరాజ్ ఏఈ పాండురంగారావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.




