ప్రభుత్వ బడుల రూపు రేఖలు మారాయి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కామారెడ్డి (జనం సాక్షి) : టాలెంట్ ఎవరి సొత్తు కాదు. విద్యార్థులు బాగా చదువుకొని గొప్పగా ఎదగాలి. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో తెలంగాణలో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో రూ.1.86 కోట్లతో మన ఊరు -మన బడి కింద నిర్మించిన జడ్పీ పాఠశాలను విద్యా శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వం KG టూ PG వరకు ఉచిత విద్యను అందిస్తుందని తెలిపారు.
2014- 15 లో 9000 కోట్ల బడ్జెట్ విద్యా రంగానికి కేటాయిస్తే ఇప్పుడది 29000 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో 1571 గురుకులాలను అప్ గ్రేడ్ చేశాం. మన ఊరు- మనబడి కార్యక్రమంలో రాష్ట్రంలో 2600 స్కూళ్లను 7000 కోట్లతో అభివృద్ది చేసుకుంటున్నామని తెలిపారు. స్కూళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకోవాలని సూచించారు.
జూనియర్ కాలేజీ ప్రపోజల్ పంపుతాం
పెద్ద కొడప్ గల్‌కు జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్ పంపుతాం. అలాగే మరో నాలుగు అదనపు గదులకు, పాఠశాల గ్రౌండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం. మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థులకు వారంలో మూడు రోజులు రాగి జావా బ్రేక్ ఫాస్ట్ ను అందిస్తున్నామని చెప్పారు.6000 మంది విద్యార్థులకు విదేశాల్లో విద్యను అభ్యసించడానికి ఓవర్ సీస్ స్కాలర్ షిప్ లు అందించి తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడేట్లు తయారు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు.