Thursday, 5 November 2026

ప్రవేశాలు ఫుల్.. రిజిష్టర్లు నిల్! -నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలు

ప్రవేశాలు ఫుల్.. రిజిష్టర్లు నిల్!
-నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలు
-పూర్తి స్థాయిలో నమోదు కాని విద్యార్థుల వివరాలు
-పర్యవేక్షణకు సరిపడా లేని మండల విద్యాధికారులు
– జిల్లా విద్యాధికారి పై పనిభారం తో తగ్గిన ఆకస్మిక తనిఖీలు
-పలు స్కూళ్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలు
వేములవాడ, డిసెంబర్ 15 (జనం సాక్షి) :
పిల్లల భవిష్యత్తు పై తల్లిదండ్రుల ఆశలను ఆసరా చేసుకొని రూ.వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు కనీస నిబంధనలు పాటించడం లేదు. స్కూల్ లో ప్రవేశం పొందిన విద్యార్థుల పూర్తి వివరాలను అడ్మిషన్ రిజిస్టర్ లో పొందుపరచాల్సి ఉండగా, ఏదో మొక్కుబడిగా చూపుతూ మమ అనిపిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు కు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే ఊదరగొట్టే ప్రచారంతో వందల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకుంటున్న పలు ప్రైవేట్ పాఠశాలలు, ఆ తర్వాత పాటించాల్సిన నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఒక్కో విద్యార్థి కి సంబంధించి స్కూల్ లో చేరిన తేదీ, తరగతి, ఇతర వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్థి భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ఈ ప్రక్రియపై చాలా స్కూళ్ల ల్లో నిర్లక్ష్యం వహించడం శోఛనీయం. ఏదైనా కారణంతో ఓ స్కూల్ మూతబడితే అందులో చదివే విద్యార్థులను మరో స్కూల్ కు బదిలీ చేసేందుకూ ఆడ్మిషన్ రిజిస్టర్ కీలకం. ఇంత ప్రాధాన్యం ఉన్న అంశాన్ని ఎక్కువ పాఠశాలలు పూర్తిగా విస్మరిస్తుండడం గమనార్హం.
తనిఖీలతోనే పరిస్థితిలో మార్పు
పాఠశాలల్లో రిజిస్టర్లు, రికార్డుల నమోదు, విద్యార్థుల విద్యా బోధన, తరగతి గదులు వంటి విషయాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత విద్యాశాఖదే. అయితే మండల విద్యాధికారుల కొరతతో పర్యవేక్షణ కొరవడడంతో ప్రైవేట్ స్కూళ్ల లో ఇష్టారాజ్యంగా మారింది.
మరువొద్దు గతం…
**వేములవాడ పట్టణంలో ఓ ప్రైవేట్ పాఠశాల అనూహ్యంగా మూత పడింది. అప్పటికే అందులో వందల సంఖ్యలో విద్యార్థులు ఉండగా, విద్యాశాఖ వారిని ఇతర స్కూళ్లకు బదిలీ చేసి విద్యాసంవత్సరం నష్టపోకుండా కాపాడింది. సదరు స్కూల్ యాజమాన్యం విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్ , ఇతర రికార్డులను సక్రమంగా నిర్వహించడంతో నే ఇది సాధ్యమైంది. నిబంధనలు పాటించని ఏదైనా స్కూల్ లో దురదృష్టవశాత్తు ఇలాంటి ఘటన పునరావృతమైతే.. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పిల్లల పరిస్థితి ఏమిటన్నది సదరు పాఠశాలల యాజమాన్యాలే చెప్పాల్సి ఉంది.