బెల్లంపల్లి, ఏప్రిల్ 16, (జనంసాక్షి )తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు మిగిలిపోయిన సీట్లను (బ్యాక్లాగ్ వేకెన్సీస్) వచ్చే విద్యా సంవత్సరానికి నింపడానికి గాను నిర్వహించిన బిఎల్వి- 2023 ప్రశాంతంగా ముగిసినది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు ఈ పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు అన్ని పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవడంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ పూర్తిస్థాయిలో సౌకర్యాలను పర్యవేక్షించారు. ఆదిలాబాద్ రీజియన్ (ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు) వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 పరీక్ష కేంద్రాల్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో 3927మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3304 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఆమె తెలిపారు. 84.14% హాజరు నమోదైనట్లు ఆమె వెల్లడించారు.
ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఎండలను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు చల్లని నీరును అందించినట్లు ఆమె తెలిపారు. బెల్లంపల్లి బాలుర సి ఓ ఈ లో 374 మంది విద్యార్థులకు గాను 317 మంది పరీక్షకు హాజరయ్యారు. 57మంది గైర్హాజరయ్యారు. బాలికల గురుకులంలో 555 మంది విద్యార్థులకు గాను 495 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్స్ ఐనాల సైదులు, సoదారాజా స్వరూప లు తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాల్లో డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ గా డాక్టర్ పూర్ణిమ, రమేష్ బాబులు విధులు నిర్వర్తించారు.




