Thursday, 5 November 2026

ప్రాణహిత – చేవెళ్ల అంచనా వ్యయం పెంపు గుర్తుకు రాలేదా? 

– రాహుల్‌.. స్కిప్ట్‌ రైటర్లతో జాగ్రత్త
– ట్విట్టర్‌లో రాహుల్‌ వ్యాఖ్యలకు సమాధానమిచ్చిన మంత్రి  హరీశ్‌ రావు
హైదరాబాద్‌, ఆగస్టు15(జ‌నం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయంపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ట్విట్టర్‌ వేదికగా సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు. స్కిప్ట్‌ రైటర్లతో జాగ్రత్తగా ఉండాలని రాహుల్‌కు హరీశ్‌రావు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌ పేరుతో అంచనా వ్యయాన్ని రూ. 38 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్లకు పెంచారని రాహుల్‌కు స్కిప్ట్‌ రైటర్లు చెప్పారని, మరి ప్రాణహిత – చేవెళ్ల తొలి జీవో రూ. 17 వేల కోట్లకు జారీ చేసిన విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు మరిచిపోయారన్నారు. ఏడాది వ్యవధిలోనే కనీసం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టకముందే 2008లో రూ. 38 వేల కోట్లకు, 2010లో రూ. 40 వేల కోట్లకు డీపీఆర్‌ సిద్ధం చేశారన్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం ఆ విధంగా ఎందుకు పెంచారో రాహుల్‌ చెప్పగలరా అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 80 వేల 190 కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదించిందని, రూ. లక్ష కోట్లకు కాదన్నారు. ఈ విషయం రాహుల్‌ గాంధీ స్కిప్ట్‌ రైటర్లకు తెలియదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రీడిజైన్‌ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించిందని, కేవలం ఏడాది వ్యవధిలోనే అన్ని అనుమతులను ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. మన దేశంలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి సీడబ్ల్యూసీ అనేది అపెక్స్‌ బాడీ.. జలవనరుల శాఖకు ఇది అనుబంధమని అన్నారు.  ఈ విషయంపై రాహుల్‌కు, ఆయన స్కిప్ట్‌ రైటర్లకు అవగాహన ఉందా అంటూ హరీశ్‌రావు అడిగారు. అలాంటి అత్యున్నత కమిషన్‌ విశ్వసనీయతను రాహుల్‌ ఎలా అనుమానిస్తారని ప్రశ్నించారు. అంబేద్కర్‌ ప్రాజెక్టు పేరును తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిందని రాహుల్‌ గాంధీ చెప్పారు. ఈ విషయంలో కూడా రాహుల్‌ను స్కిప్టు రైటర్లు తప్పుదోవ పట్టించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అంబేద్కర్‌ ప్రాణహిత ప్రాజెక్టు అలాగే హరీష్‌రావు అన్నారు.
ఇప్పటికైన రాహుల్‌ అవగాహనతో మాట్లాడాలని హరీష్‌రావు హితవుపలికారు.