Thursday, 5 November 2026

ప్రైవేట్‌ పాఠశాలల్లో వెట్టిచాకిరి

ప్రైవేట్‌ టీచర్ల సమస్యలు పట్టించుకోవాలి

రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల్లో పెట్టాలి

ప్రైవేట్‌ పాఠశాలల టీచర్ల యూనియన్‌ డిమాండ్‌

హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలో విద్యారంగ పటిష్టతకు పాటుపడుతూ సామాజిక సేవ చేస్తున్న ప్రైవేట్‌ టీచర్లు అనేక వృత్తిగతమైన ఇబ్బందులు ఎదుర్కొటున్నారని ప్రైవేట్‌ పాఠశాలల టీచర్ల యూనియన్‌ అధ్యక్షుడు షేక షబ్బీర్‌ అలీ అన్నారు. ప్రైవేట్‌ టీచర్లు తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మందికి పైగా ఉన్నారని దాదాపు తెలంగాణలోని 90 శాతం మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత వీరిపై ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తమ సమస్యలను ప్రస్తావించాలని అన్ని పార్టీలను కోరామని, మేనిఫెస్టోలో చేర్చాలని అన్నామని అన్నారు. తమ సమస్యలను ప్రస్తావించే వారికే తమ మద్దతు ఉంటుందన్నారు. చదవుతో సమాజంలో పెద్ద బాధ్యతను మోస్తున్న టీచర్లు అంతకుమించిన సమస్యలనూ భరిస్తున్నారు. పనిగంటలు పెచ్చి, ఇతర పనులను కూడా విధుల్లో చేర్చి ప్రైవేట్‌ టీచర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా వేసవిసెలవుల్లోనూ విధులు నిర్వహించాలని యాజమాన్యాలు హుకూం జారీ చేస్తున్నాయి. టీచర్లనే సేల్స్‌ మ్యాన్‌లను చేస్తూ ఇంటింటికి తిరిగి విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఒత్తిడి చేస్తున్నారు. విధుల భారంపై ధైర్యం చేసి ఏ టీచరైనా ప్రశ్నిస్తే ప్రైవేట్‌ అంటే ఇలానే ఉంటుందని యాజమాన్యాలు కుండబద్దలు కొడుతున్నాయి. ఉద్యోగం ఉండాలంటే ఇవన్నీ చేయాలని యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. దీంతో తప్పని పరిస్థితిలో ప్రైవేట్‌ టీచర్లు అన్ని పనులు చేయాల్సి వస్తుంది. పాఠాలు చెబుతూ, ఇతర రాత పనులు చేస్తూ క్లర్క్‌గా, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు క్యాన్వెసింగ్‌ కూడా చేస్తూ ప్రచారకర్తలుగా పనులు నిర్వహిస్తున్నారు. దీంతో పనుల ఒత్తిడిలో అసలు పని బోధన చేయలేక పోతున్నామని ప్రైవేట్‌ టీచర్లు వాపోతున్నారు. తాము వృత్తిగతంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అన్‌ఇన పార్టీలకు వివరించామని అన్నారు. అన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయన్నారు. అయితే ఎవరుకూడా అధికారికంగా ఇంతవరకు ప్రకటన చేయలేదన్నారు. ముఖ్యంగా మహిళా టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల సాధారణ సమయాలతో పాటు ప్రత్యేక తరగతుల పేరుతో గంటల కొద్దీ క్లాసులు ఏర్పాటు చేయడంతో మహిళా ఉపాధ్యాయులు శారీరక సమస్యలకు గురవుతున్నారు. ప్రైవేట్‌ టీచర్ల ఉద్యోగ భద్రత గాలిలో దీపం లాంటిదని, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఊడిగం చేస్తున్న

ఉద్యోగభద్రత లేదన్నారు. దీంతో అభద్రతా భావంతో ప్రైవేట్‌ టీచర్‌ కొట్టుమిట్టాడుతున్నాడు. అసలే అర కొర జీతాలు ఇస్తూ, మరోవైపు అన్ని పనులు నెత్తిన వేస్తూ ఎదురు చెప్పితే ఉద్యోగాలు ఉండవని యాజమాన్యాలు బ్లాక్‌మేల్‌ చేస్తున్నాయని పలువురు ప్రైవేట్‌ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల చెల్లింపుల్లోనూ యాజమాన్యం వివక్ష చూపుతుంది. విద్యాహక్కు చట్టం ఎమ్‌ఎస్‌-1 ప్రకారం యాజమాన్యం ఆదాయంలో 15 శాతం డబ్బును ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కేటాయించాలి. పి.ఎఫ్‌, వైద్య, ఇతర సదుపాయాల నిమిత్తం కేటాయించాలి. కాని యాజమాన్యాలు నిబంధనలకు పాతర వేస్తూ, ఇష్టారాజ్యంగా

వ్యవహరిస్తున్నాయి. వేల రూపాయలను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వివిధ ఫీజుల పేరుతో యాజమాన్యాలు వసూళ్లు చేస్తూ ఖజానా నింపుకుంటున్నాయి. పాఠశాల ఆస్తులను పెంచుకుంటున్నాయి. కాని అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. యాజమాన్యలకే అధికారంలో ఉన్నవారు ఇంతకాలం వత్తాసు పలికారని షబ్బీర్‌అలీ ఆరోపించారు. తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించాలన్నారు. ఒకవైపు పనుల భారం మోపుతో, మరోవైపు ర్యాంకులు రాకపోయినా, ఉత్తీర్ణత శాతం తగ్గినా టీచర్లపైనే బాధ్యత వేస్తూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో అటు ర్యాంకులు సాధించేలా బోధన చేయలేక, ఇటు ఇతర పనులు చేయలేక టీచర్లు సతమతమవుతున్నారు. కార్పొరేట్‌ పాఠశాలల్లో ఈ ధోరణి మరీ ఎక్కువగా ఉన్నట్లు ప్రైవేట్‌ టీచర్లు చెబుతన్నారు.ప్రైవేట్‌ టీచర్లకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన సెలవుల్లోనూ వివక్ష చూపుతున్నాయి యాజమాన్యాలు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ, దసరా సెలవులను పెంచింది. కాని కార్పొరేట్‌ యాజమాన్యాలు వాటిని అమలు చేయలేదు. దీంతో తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌ ఫోరం ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది. తమకు చట్టపరంగా రక్షణ కావాలన్నరు. ఎన్నికల సమయంలో తమను ఆదరించేవారి కోసం చూస్తున్నామని అన్నారు. తమ సమస్యలను పరిశీలించే నాయకత్వం కావాలని కోరుకుంటున్నామని చెప్పారు.