గుంటూరు,నవంబర్12(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టదాయకమైన కంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్) ప్రభుత్వం రద్దుచేసే వరకు పోరాటం సాగిస్తామని టీచర్ సంఘాలు స్పష్టం చేశారు. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారికి సీపీఎస్ విధానంవల్ల ఎంతో నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ దృష్ట్యా సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాతపింఛను విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీని కోసం అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి సంఘటిత పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులపై పనిభారం పెంచేసి తనిఖీల పేరుతో సెస్పెన్షన్లు విధించడం మంచి పద్ధతికాదని, ఇలాంటి విధానాలను విద్యాశాఖాధికారులు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రస్తుత విద్యాసంవత్సరంలో సీసీఈ విధానాన్ని అనుసరించడంవల్ల విద్యార్థులపై ఆర్థికభారం పడుతోందన్నారు. అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలు త్వరలో రాష్ట్రపతి ఆమోదం పొందనున్నాయని చెప్పారు. ఏకీకృత సర్వీసు నిబంధనల ఆమోదం కోరుతూ ఇప్పటికే పీఆర్టీయూకు చెందిన ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులతో కూడిన బృందం ఇటీవలకాలంలో దిల్లీవెళ్లి పలువురు కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఏకీకృత సర్వీసు నిబంధనలకు
ఆమోదం లభించగానే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మండల, ఉపవిద్యాశాఖాధికారుల కొలువులు, డైట్ అధ్యాపకుల కొలువులు, జూనియర్ అధ్యాపకుల కొలువులు రెగ్యులర్ ప్రాతిపతికన భర్తీఅవుతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 669 ఎంఈవో కొలువులు ఖాళీగా ఉన్నాయని, అర్హత కలిగిన ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలుగా పదోన్నతులు కల్పించే దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఉపాధ్యాయుల సామర్థ్య పరిశీలన కోసం ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన ‘టీఎన్ఐటీ’ పరీక్షను
రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల ఆందోళన మేరకు టీఎన్ఐటీ పరీక్షను
తాత్కాలికంగా వాయిదా వేసిన ప్రభుత్వం దానిని రద్దుచేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీఈడీ, టెట్, డీఎస్సీ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించినవారికి సామర్థ్య పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. అవసరమైతే ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించుకోవాలే తప్ప ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇలాంటి పరీక్షల నిర్వహణ సరికాదన్నారు. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలు ఇవ్వడంలో తప్పులేదుకానీ, సామర్థ్య పరీక్షలు నిర్వహించి గ్రేడింగులు ఇవ్వాలనుకోవడం సహేతుకం కాదని పేర్కొన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగ అభివృద్ధికి వినియోగించడం మంచి పద్ధతే అయినప్పటికీ ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించడం సరికాదన్నారు. సాంకేతికత పేరుతో ఉపాధ్యాయులకు పనిభారం పెంచితే బోధన కుంటుపడుతుందన్నారు.




