మోసగాళ్ల కోసం గాలింపు
హైదరాబాద్,జనవరి30(జనంసాక్షి): నకిలీ బంగారం అంటగట్టి మోసగించిన కేసులో ఇద్దరు వ్యక్తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పొలంలో పని చేస్తుండగా బంగారు హారం దొరికిందని ఓ వ్యక్తిని ఇద్దరు ఆగంతుకులు మోసగించి రూ. 9 లక్షలు కాజేశారు. మధురానగర్‌కు చెందిన వైకే రమణారెడ్డి పళ్ల రసాల వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల ఆయన వద్దకు శివాజీ, మాధవ్ పేర్లుగల ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. పొలంలో పనిచేస్తుండగా కిలో 250 గ్రాముల బంగారు హారం దొరికిందని చూపించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, దాన్ని విక్రయిస్తామని చెప్పారు. హారం నుంచి చిన్న ముక్క కట్ చేసి రమణారెడ్డికి ఇచ్చారు. దాన్ని అతడు పరీక్ష చేయించగా బంగారమని తేలింది. ఆగంతుకులు రమణారెడ్డికి ఫోన్ చేసి రూ. 9 లక్షలు ఇస్తే హారం ఇస్తామని బేరం కుదుర్చుకున్నారు. వారి మాటలు నమ్మి నగదు ఇచ్చి హారం తీసుకున్నాడు. దాన్ని తీసుకెళ్లి నగల దుకాణంలో పరీక్ష చేయించగా నకిలీదని తేలింది. బాధితుడు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




