Tuesday, 3 November 2026

ఫేస్‌బుక్‌లో వేధింపుల పోకిరీకి కటకటాలు

హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): ఫేస్‌బుక్‌లో అసభ్యకర ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేసి మహిళను వేధిస్తున్న యువకుడిని సైబరాబాద్‌ పోలీసులు ఆటకట్టించారు. అతడిని చాకచక్యంగా అరెస్ట్‌ చేసిన కటకటాల వెనక్కి పంపారు. డీసీపీ జానకి షర్మిల తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లికి చెందిన మహిళకు గుర్తుతెలియని వ్యక్తి ఆమె ఫేస్‌బుక్‌ ఖాతాలో అభ్యంతరకర ఫొటోలు, అశ్లీల వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్నాడు. ఆమెతో చాటింగ్‌ చేస్తూ.. తాను చెప్పినట్టు వినకపోతే పరువు తీస్తానని బెదిరిస్తున్నాడు. బాధితురాలు విషయం భర్తకు చెప్పింది. అతడు నిందితుడిని హెచ్చరించినా తన పద్ధతి మార్చుకోలేదు. బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ కైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెక్నికల్‌ ఆధారాలు సేకరించి నిందితుడు చేవెళ్ల మండలం, కందడకు చెందిన రాఘవేందర్‌ అనే యువకుడిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.