Tuesday, 3 November 2026

బండి సంజయ్‌ అడ్డంగా దొరికిండు.. పేపర్‌ లీకేజీ కుట్రపై మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌

బండి సంజయ్‌ అడ్డంగా దొరికిండు.. పేపర్‌ లీకేజీ కుట్రపై మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌
పదో తరగతి పేపర్‌ లీకేజీకి పాల్పడి బండి సంజయ్‌, బీజేపీ పార్టీ అడ్డంగా దొరికిపోయిందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. పేపర్‌ లీకేజీ వెనుక ఉన్న సూత్రధారి బీజేపీకి కరుడు కట్టిన కార్యకర్త, బండి సంజయ్‌కు ముఖ్య అనుచరుడు అని తెలిపారు. పేపర్‌ లీకేజీకి పాల్పడిన ప్రశాంత్‌ మీ పార్టీ కార్యకర్త కాకపోతే అతన్ని విడుదల చేయాలని ఎందుకు డిమాండ్‌ చేశారని బీజేపీని ప్రశ్నించారు.
లీకేజీ సూత్రధారి బండి సంజయే
‘ బీజేపీ నాయకులకు చదువు విలువ తెలియదు. బీజేపీలో చదువుకున్నోళ్లు తక్కువ ఉన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రం దాకా అంతా ఫేక్‌ సర్టిఫికెట్లే వీళ్లవి. ఈ పేపర్‌ లీకేజీ వెనుక సూత్రధారి, పాత్రధారి అంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా బండి సంజయ్‌ ఉన్నాడు. బండి సంజయే కుట్ర చేసిండు. బండి సంజయ్‌ మొన్న తాండూరులో జరిగిన పేపర్‌ లీకేజీలో అయిన.. వరంగల్‌ పేపర్‌ లీకేజీ వెనుక ఆయనే ఉన్నాడని అందరికీ అర్థమవుతంది. ఎందుకంటే తాండూరులో తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ వెనుక ఉన్న ఉపాధ్యాయుడు బీజేపీ ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకుడు. నిన్న అరెస్టయిన ప్రశాంత్‌.. బీజేపీలో కరుడుగట్టిన కార్యకర్త. బండి సంజయ్‌కు ముఖ్య అనుచరుడు. జాతీయ, రాష్ట్ర నాయకులతో ప్రశాంత్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది. సంజయ్‌ దీని వెనుక సూత్రధారి. ‘ అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎన్నో కుట్రలు చేసిండ్రు. పేపర్‌ లీకేజీ కాదు.. గతంలో కూడా బీజేపీ అనేక కుట్రలకు పన్నిందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ‘ జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు ఆత్మహత్య పేరుతో గందరగోళం సృష్టించి లబ్ధి పొందాలని చూసిండ్రు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని చూసిండ్రు. ఈడీ, సీబీఐ, ఐటీ నోటీసులిచ్చి కుట్రలు పన్నిండ్రు. చివరకు ప్రశ్నపత్రాలు లీకేజీతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. దిగజారి కుట్రలతో పేపర్‌ లీకవుతుందని ప్రజల్లో గందరగోళం సృష్టించాలని దివాళా, దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడుతోంది. ‘ అని ఆరోపించారు