బడా సేట్ల గుప్పిట్లో బంది అయినా “బతుకమ్మ”..!
సొసైటీలను మింగేశారు_ ఎస్ ఎస్ ఐ యూనిట్లను వదల్లేదు.
మంత్రి మావోడు ఏం రాసుకుంటారోరాసుకోండి.
మంత్రి ఇలాకలో ఏం జరుగుతుంది._1.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 15. (జనంసాక్షి) సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఇటీవల కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొంతకాలంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నుండి మరమగ్గాలు తూకానికి వెళుతున్న క్రమంలో ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్ తో పాటు అనేక ఆర్డర్లను ఇస్తూ పరిశ్రమకు చేయూత ఇస్తున్న క్రమంలో ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయంలో క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలో ఆందోళన కలిగించే పరిణామాలు తెలియ వచ్చాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నుంచి “జనంసాక్షి” అందిస్తున్న ప్రత్యేక కథనం….
సిరిసిల్ల గడప గడపలో పరుచుకున్న విషాదాన్ని శాసనసభ్యులుగా కల్వకుంట్ల తారక రామారావు స్వయంగా చూశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేనేత జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ సిరిసిల్ల సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆయన సంకల్పం నుంచి బతుకమ్మ చీరల ఆర్డర్ తో పాటు ఇతర ఆర్డర్లు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఊపిరి పోసుకున్నాయి. సిరిసిల్లలో తరచూ సంక్షోభాల బారిన పడుతున్న ప్రతిసారీ కింది స్థాయిలో ఉన్న మరమగ్గాల కార్మికులు ఆసాములు బలవుతున్నారు. ఈ వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకుని అభివృద్ధిలోకి రావాలన్న మంత్రి కేటీఆర్ ప్రణాళికబద్ధమైన ఆలోచనలు మర మగ్గాల సహకార సంఘాలకు ఊపిరి పోశాయి.అట్లా తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చేయూత అందించడం కోసం దేశంలోనే తొలి సారిగా ఇక్కడే ప్రారంభమైంది. అట్లా ప్రారంభమైన బతుకమ్మ ప్రస్తుతం కొద్దిమంది బడా సేట్ల గుప్పిట్లో బందీగా మారింది.
ఇలా దారి మళ్లించారు…
మొదట్లో మరమగ్గాల సహకార సంఘాల వద్ద ముడి సరుకులు కొనుగోలు చేసేందుకు ఆర్థిక వనరులు లేకపోవడంతో బడా సేట్లను ఆశ్రయించక తప్పలేదు. ఇట్లా మెల్ల మెల్లగా ఆసాములు చేతుల్లోంచి అనేక సంఘాలు బినామీగా మారి బడా సేట్ల గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి. అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్ సంగాలవారీగా లెక్కల కట్టి ఓక్కో సంఘానికి ఎన్నీ మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయాలని చెబుతుంది. తరచూ డిజైన్లు మారుతుండడంతో దాబిలతోపాటు ఇతర ఖర్చులు కలుపుకుంటే ఉత్పత్తి చేసిన తమకు మిగిలేది ఏమీలేదని అనేకమంది సహకార సంఘాల సభ్యులు నిరాశకు లోనైనా పరిస్థితులు ఉన్నాయి. ఈ అవకాశాన్ని కూడా వదులుకొని కొంతమంది సేట్లు వారికి జత సంచాలకు నాలుగు వేల రూపాయల చొప్పున కమిషన్ ఇచ్చి ఆ సంఘాలను నిర్వీర్యం చేసిన సందర్భాలు ఉన్నాయి.సభ్యులకు సంబంధించిన ఉత్పత్తులను తమ సొంత మరమగ్గాలపై ఉత్పత్తి చేస్తు అందరికీ చేరవలసిన లాభాలను తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాము మనుగడ సాగించలేమని పలువూరు సహకార సంఘాల సభ్యులు తమ మర మాగ్గాలను తూకానికి వేయాల్సిన పరిస్థితులు తప్పడం లేదంటూ పలువురు చిన్న తరహా అసాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




