Thursday, 5 November 2026

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వైసీపీ కృషి

– రాజమండ్రి ఎంపీ సీటు బీసీలకు కేటాయిస్తాం
– వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి
– జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన బీసీ సంఘాల నేతలు
విజయనగరం, నవంబర్‌12(జ‌నంసాక్షి) : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వైసీపీ పెద్దపీట వేస్తుందని, వారిని పార్టీలో కీలక ప్రాధాన్యతను కల్పిస్తామని వైసీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. ఈసందర్భంగా రాజమండ్రికి చెందిన బీసీ సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకుడు, శెట్టి బలిజ, గౌడ, ఈడిగ, శ్రీసైన, యాత కులాల రాష్ట్ర అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, ఆయన తనయుడు మార్గాని భరత్‌లు వైసీపీలో చేరారు. వీరికి కండువా వేసి వైఎస్‌ జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యన్నతికీ వైఎస్సార్‌సీపీ కృషి చేస్తుందన్నారు. రాజమండ్రి ఎంపీ సీటు బీసీలకు ఇస్తామని ఇదివరకే ప్రకటించామని, ఈ ప్రకటనతో బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు. అందులో భాగంగానే బీసీ నేతలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మార్గాని నాగేశ్వరరావు, భరత్‌లతో పాటు పార్టీలో చేరిన బీసీ నేతలను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నానన్నారు. బడుగు, బలహీన వర్గాలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు.. అందుకు తగిన కృషి చేస్తామని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. తాత్కలిక విరామం అనంతరం జననేత ప్రజాసంకల్పయాత్రను పున:ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. జననేతతో అడుగులో అడుగేసెందుకు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
జగన్‌కు భారీ భద్రత..
విశాఖ విమానాశ్రయంలో దాడి నేపథ్యంలో, 17రోజుల విరామం తర్వాత వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్ర సోమవారం మళ్లీ ప్రారంభమైంది. విజయనగరం జిల్లా మక్కువ మండలం పాయకపాడు నుంచి జగన్‌ తన పాదయాత్రను పున:ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జగన్‌ కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
అడుగడుగునా పోలీస్‌ సెక్యూరిటీ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రీన్‌, బ్లూ, రెడ్‌ విభాగాలుగా సెక్యూరిటీని విభజించారు. జగన్‌ ను కలుసుకోవాలనుకునే జనాల కోసం రెడ్‌ కార్డులను ఇష్యు చేశారు. జగన్‌ ను అనుసరించే ఎమ్మెల్యేలు, నేతలు, ఇతర సిబ్బందికి బ్లూ కార్డులు, బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బందికి గ్రీన్‌ కార్డులను అందించారు. ప్రతి ఒక్కరిని తనిఖీలు చేసిన తర్వాతే ఆయన వద్దకు అనుమతినిస్తున్నారు. జగన్‌ చుట్టూ మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.