Wednesday, 4 November 2026

బదిలీలు,పదోన్నతులు అత్యంత పారదర్శకంగా జరిగేలా ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలి.

 

 

 

 

రాష్ట్ర పరిశీలకురాలు ఏ ఉషారాణి.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 9(జనంసాక్షి):జిల్లాలో ఏ ఒక్క ఉపాధ్యాయుడికి అన్యాయం జరగకుండా బదిలీలు పదోన్నతులు అత్యంత పారదర్శకంగా చేపడతామని నాగర్ కర్నూల్ జిల్లా బదిలీలు,పదోన్నతుల రాష్ట్ర పరిశీలకురాలు ఎ.ఉషారాణి అన్నారు.గురువారం డిఈవో గోవిందరాజులుతో కలిసి నాగర్ కర్నూల్ డిఇఓ కార్యాలయంలో జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులతో ఆమె సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు,పదోన్నతులను అత్యంత పరదర్శకంగా జరిగేలా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సహకరించాలని ఆమె కోరారు.
జిల్లాలో ఏ ఒక్క ఉపాధ్యాయుడికి అన్యాయం జరగకుండా బదిలీలు పదోన్నతులు చేపడతామని ఉపాధ్యాయ సంఘాలకు ఆమె భరోసా ఇచ్చారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు
జీవో 317తో బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.ఈనెల 12వ తేదీ నుంచి 14 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని, జిల్లాలో ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా సంఘాలు కృషి చేయాలన్నారు.డిఈవో గోవిందరాజులు మాట్లాడుతూ…నాగర్ కర్నూల్ జిల్లాలో బదిలీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేలా ఉపాధ్యాయుల సీనియారిటీ మరియు ఉపాధ్యాయుల ఖాళీలను పారదర్శకంగా వెల్లడిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఉపాధ్యాయ బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, అడక్వసిని అమలు చేయొద్దని, ప్రిఫరెన్ సెల్ కేటగిరిని వాడుకున్న వాళ్ళు తిరిగి వాడుకోకుండా చూడాలని, 317 జీవో లో బదిలీ అయిన ఉపాధ్యాయులకు పాత కొత్త స్టేషన్ పాయింట్లు కలిపి ఇవ్వాలని, ఎస్ జి టి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కు వెళ్లే ఎలిజిబుల్ ఉన్న అన్ని సబ్జెక్టులకు అవకాశం ఇవ్వాలని, నాట్ విల్లింగ్, అండర్ టేకింగ్ గాని తీసుకోకూడదని, సమస్యల ప్రిఫరెన్షియల్ కేటగిరి వాడుకున్న వాళ్ళు తిరిగి వాడుకోకూడదని, ఏ ఒక్క ఉపాధ్యాయుడికి సర్వీస్ తేడా రాకుండా ఉమ్మడి జిల్లా నుండి ఉపాధ్యాయుల సమగ్ర వివరాలను తెప్పించుకొని సరిచేయాలని, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఆమెను కోరారు.అందుకు ఆమె స్పందించి సమస్యలను పరిష్కరించి పారదర్శకంగా బదిలీలు పదోన్నతులు చేపడతామని ఆమె సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, బహుజన టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుడిపల్లి నిరంజన్, పచ్చిపాల సుబ్బయ్య, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్ శర్మ, పిఆర్టియు టీఎస్ సత్యనారాయణ రెడ్డి, డిటిఎఫ్ లక్ష్మణ్, ఎస్ టి యు మురళి, తపస్ నుండి శేఖర్, ఎస్జిటి రాజేష్, బిసిటిఏ సి. వెంకటయ్య, పిఈటిఏ సీతారాం నాయక్, టిటియు రవీంద్రబాబు, రూప్ శ్రీనివాస్ గౌడ్, టీఎస్ యుటిఎఫ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.