Tuesday, 3 November 2026

బద్దం బాల్‌రెడ్డి పేదల మనిషి

ఘనంగా నివాళి అర్పించిన స్పీకర్‌ పోచారం,మంత్రులు
హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): బీజేపీ పార్టీ సీనియర్‌ లీడర్‌,  మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌ రెడ్డి.. మృతి తెలంగాణ రాష్ట్రానికి  తీరని లోటని స్పీకర్‌  పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మృదుస్వభావి అయిన బాల్‌ రెడ్డి.. అసెంబ్లీలో ఎంతో హుందాగా ప్రవర్తించే వారని.. స్పీకర్‌ పోచారం, మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున బాల్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రులు తలసాని, ఎర్రబెల్లి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తన జీవితాంతం పేదల సంక్షేమం కోసం పనిచేసిన మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి మృతి తీరని లోటని తెలంగాణ మంత్రులు అన్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి , మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మంత్రులు తలసాని, ఎర్రబెల్లి తదితరులు బాల్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌
సాధించిన బాల్‌రెడ్డి పేదల అభ్యున్నతికి పాటుపడ్డారని కొనియాడారు. బాల్‌రెడ్డి మరణం తీరని లోటు. ప్రజల మనిషిగా ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్‌ ప్రజలతో బాల్‌రెడ్డికి అవినాభావ సంబంధం ఉంది. బాల్‌రెడ్డి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జాతి నిర్మాణంలో బాల్‌రెడ్డి అనేక సేవలు చేశారు. హైదరాబాద్‌ ప్రజల్లో బాల్‌రెడ్డి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. బీజేపీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన మరణం బీజేపీకి, హైదరాబాద్‌ ప్రజలకు తీరని లోటని మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ నివాళి అర్పించారు. బాల్‌రెడ్డి మృతి పేద, బడుగు వర్గాల ప్రజలకు తీరనిలోటు. ఆయన పేద ప్రజలకు అండగా ఉండేవారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో బాల్‌రెడ్డి పాలు పంచుకున్నారు. బాల్‌రెడ్డి మృతి రాష్ట్ర ప్రజలకు తీరనిలోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాతబస్తీలో మతతత్వానికి వ్యతిరేకంగా బాల్‌రెడ్డి పోరాటం చేశారు. జనతాపార్టీ నుంచి అనేక విషయాలపై కలిసి పనిచేశాం. ప్రజా సమస్యలపై బాల్‌రెడ్డి అంకితభావంతో పనిచేశారు. హైదరాబాద్‌ రాజకీయాల్లో ఆయన లేనిలోటు పూడ్చలేనిది. బాల్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి అని  మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి నివాళి అర్పించారు.