బాబురావు మృతి పట్ల నవభారత్ యాజమాన్యంతో చర్చించిన ఎమ్మెల్యేలు
* ఇన్సూరెన్స్ తో కలిపి రు.17 లక్షలు
* మృతుని భార్యకు పెన్షన్ నెలకు రు.9 వేలు
* కూతురికి నవభారత్ పాఠశాలలో ఉచిత విద్య
* ఎమ్మెల్యే వనమా, హరిప్రియల చొరవతో యాజమాన్యం ఒప్పుకోలు
టేకులపల్లి, జనవరి 4( జనం సాక్షి): టేకులపల్లి మండలం లోని సులానగర్ గ్రామానికి చెందిన దామల్ల బాబురావు పాల్వంచ లోని నవభారత్ కంపెనీ లో మంగళవారం పని చేస్తుండగా ప్రమాదవశాత్తు సేఫ్టీ బెల్టు తెగిపోవడంతో కిందపడి తీవ్ర గాయాలు కాగా వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విధితమే.మృతి చెందిన దామల్ల బాబురావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మంగళవారం రాత్రి నుండి నవభారత్ గేట్ ముందు ధర్నా చేశారు. వారికి పోలీసులు నచ్చచెప్పి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ చొరవతో, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకొని రాగా నవభారత్ కంపెనీ యాజమాన్యంతో వనమా స్వగృహంలో పేద కుటుంబం అయిన బాబురావు మృతితో కుటుంబమంతా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ఆ కుటుంబానికి కచ్చితంగా కంపెనీ న్యాయం చేయాలని చర్చలు జరిపారు. దీంతో యాజమాన్యం మృతుని కుటుంబానికి ఇన్సూరెన్స్ తో కలిపి రు. 17 లక్షలు, మృతుని భార్య శశికళకు నెలకు పెన్షన్ రు.9వేలు, మృతుని నాలుగు సంవత్సరముల కూతురుకి నవభారత్ పాఠశాలలో ఉచిత విద్యను అందించుటకు అంగీకారంతో ఒప్పుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం శవాన్ని సులానగర్ తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.




