Wednesday, 4 November 2026

బాలుర వసతి గృహంలో న్యాయ విజ్ఞాన సదస్సు

బాలుర వసతి గృహంలో న్యాయ విజ్ఞాన సదస్సు
జహీరాబాద్ నవంబర్ 7 (జనంసాక్షి)
మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో స్థానిక జహీరాబాద్ మండల కేంద్రంలో గల ఎస్సి బాలుర వసతి గృహంలో న్యాయ విజ్ఞాన సదస్సును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సూరి కృష్ణ నిర్వహించి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్ధి దశ చాలా కీలకమైనదని, చెడుకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ వహించాలని, సమయ పాలన పాటించాలని, తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని సూచించారు. ప్రభుత్వం అందించే అవకాశాలను అంది పుచ్చు కోవడమే కాకుండా విద్యార్థులందరూ చక్కగా చదువుకొని, ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలని సూచించారు. పాఠశాలలో తోటి బాలికల పట్ల, మహిళలపట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే జైలుశిక్ష తో పాటు జరిమానా కూడా విధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం, మోటారు వాహనాల చట్టం, బాలకార్మిక నిర్మూలన చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, జువైనైల్ జస్టిస్ యాక్ట్ పై విద్యార్థులకు తెలియజేసారు. విద్యార్థులు సరైన వయసు వచ్చేవరకు వాహనాలు నడపకూడదని, ఒకవేళ పై నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపి ప్రమాదానికి కారణమైన కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు కూడా శిక్షార్హులేనని పేర్కొన్నారు.ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు మానెన్న, విజయ్ కుమార్, రుద్రయ్య స్వామి, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, వసతి గృహ ఇంచార్జి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.