.
అంగరంగ వైభవంగా ముస్తాబైన బాసర ఆలయం…
భైంసా రూరల్ జనవరి 25 జనం సాక్షి
చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజైన వసంత పంచమి వేడుకలు తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలోని వ్యాస ప్రతిష్ట బాసర శ్రీజ్ఞాన సరస్వతి క్షేత్రంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.గురువారం జరగబోయే వసంతపంచమి వేడుకలకు సంబంధించి విద్యుత్ దీపాలంకరణ, క్యూలైన్లు, తడకల పందిళ్లు, పుష్పాలంకరణ ఏర్పాట్లు అదేవిధంగా ప్రత్యేకత పార్కింగ్ ఏర్పాట్లు సౌకర్యాలను ఈ.వో విజయరామారావు నేతృత్వంలో పూర్తి చేశారు. గురువారం శ్రీపంచమి రోజు ఉదయం7 తెల్లవారుజాము మంగళ వాయిద్య సేవ, గురుప్రార్థన గణపతి పూజలతో అభిషేకం కార్యక్రమాలు జరుగుతాయని, ఉదయం 3గం.ల తెల్లవారు జాము నుండి ప్రత్యేక అక్షరాభ్యాసానికి భక్తులను అనుమతిస్తారని,
తదుపరి 7 గంటల నుండి చండీ మహా విద్యా హోమము, బలిప్రదానము, పూర్ణాహుతి కార్యక్రమాలను స్థానాచార్య ఆధ్వర్యంలో వైదికులు నిర్వహిస్తారు.ముఖ్య అతిథులుగా న్యాయ దేవాదాయ,పర్యావరణ,అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ముధోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విట్టల్ రెడ్డి,ప్రముఖులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి పట్టు వస్త్రములను సమర్పిస్తారని, సాయంత్రం 6-30 గంటలకు మంగళ హారతి, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వితరణ గావించి ఆలయ అధికారులు వైదికలు కలిసి వసంత పంచమి ఉత్సవ పరిసమాప్తిని చేస్తారని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్రం, పక్క రాష్ట్రాల నలుమూలల నుండి వచ్చే భక్తులకి ఉచిత అన్నప్రసాదం, వైద్యసౌకర్యం, ఉచిత బస్సు సౌకర్యాన్ని బాసర ఆలయం తరుపున కల్పిస్తారని అధికారులు తెలిపారు




