Monday, 2 November 2026

బిజెపి నగర నేతలకు ప్రతిష్టాత్మకం కానున్న ఎన్నికలు 

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి,ఎమ్మెల్యే రాజాసింగ్‌లకు పరీక్ష
హైదరాబాద్‌,నవంబర్‌30 (జనం సాక్షి):   గ్రేటర్‌ ఎన్నికలు బీజేపీ నగర నేతలకు సవాల్‌గా మారాయి. నగరంలో ఓ ఎంపి, ఓ ఎమ్మెల్యే మాత్రమే బిజెపికి ఉన్నారు. వారిలో ఒకరు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మరొకరు గోషా మహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ . వీరిద్దరికీ ఈ ఎన్నికలు ప్రతిష్ట కానున్నాయి. అయితే బిజెపి తరఫున అగ్రనాయకులంతా వచ్చి ప్రచారం చేపట్టారు. వీరికితోడు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ ఎన్‌. రాంచందర్‌రావులకు కూడా కార్పొరేషన్‌ ఎన్నికలు కీలకంగా మారాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  2019లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి గెలిచారు. దీంతో తన నియోజకవర్గంలో అత్యధిక  సీట్లు గెలిపించి పట్టు నిలుపుకోవాలని ఆయన పట్టుదలగా కృషి చేస్తున్నారు. ఈ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఒక్కో అసెంబ్లీ స్థానంలో 5 నుంచి 7 వరకు డివిజన్లు ఉన్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కిషన్‌రెడ్డి అధిక్యం సాధించారు. గ్రేటర్‌లో కూడా అదే పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నారు. గ్రేటర్‌ మొత్తాన్ని పర్యవేక్షిస్తూనే తన నియోజకవర్గంపై కూడా దృష్టి సారించారు. ఇకపోతే ఒకేఒక ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఉన్నారు. గోషామహల్‌ నియోజకవర్గ పరిధిలో తన వారికి టికెట్లు రాకపోవడంతో ఎమ్మెల్యే రాజాసింగ్‌ పార్టీ పెద్దలపై ఆగ్రహంతో ఉన్నారు. ఆయన పార్టీ తరఫున సిటీలో ఇతర ప్రాంతాలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ తన నియోజకవర్గంపై పెద్దగా దృష్టి సారించ  లేదని ఆందోళన చెందుతున్నారు.
ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మొన్నటి వరకు బీజేపీ నగర అధ్యక్షుడిగా వ్యవహరించారు. గత పార్లమెంట్‌ ఎన్నికలో మల్కాజిగిరి నుంచి ఓడిపోయినా నియోజకవర్గం పరిధిలో ఆయనకు మంచి పట్టు ఉంది. ఇక్కడి నుంచి అధిక స్థానాలు గెలిపిస్తే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల నాటికి తన ప్రతిష్టను మరింత పెంచుకోవచ్చని భావిస్తున్నారు.  ఆయన ఇతర నియోజక వర్గాల అభ్యర్థుల విజయం కోసమూ కృషి చేస్తున్నారు. డాక్టర్‌ లక్ష్మణ్‌ ముషీరాబాద్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడి ¬దాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని అత్యధిక డివిజన్లలో అభ్యర్థులను గెలిపించి, తన పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు.  టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తుండడంతో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను లక్ష్మణ్‌ తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో కూడా తన ప్రత్యేకతను చూపించారు. అభ్యర్థులపై పూర్తి భారం వేయకుండా తాను కూడా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి వీరి ప్రభావం ఏ మేరకు ఉండనుందో ప్రజలు తమ ఓటు ద్వారా తేల్చనున్నారు.