జనంసాక్షి, మంథని : గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో మండల సర్వసమావేశాల్లో ప్రజా ప్రతినిధులతో మాటలు పడ్డ వైద్య అధికారులు, సిబ్బంది ఈనాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రశంసలు అందుకుంటున్నారని, నాయకత్వం పనితీరును బట్టే ప్రభుత్వ అధికారుల పనితీరు ఉంటుందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ ఫుట్ట మధూకర్ అన్నారు.తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా మంథనిలోని మాతాశిశు ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ కుమార్, భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే వారని, కానీ ఈనాడు ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో ఎంతో నమ్మకం కల్గించడం జరిగిందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ దావఖానాలు మెరుగుపడ్డాయని ఆయన అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన పదేండ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విజయాలు సాధించారని, ఎంతో ప్రగతితో ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మార్పులపై చర్చించుకోవాల్సిన అవసరం ఉందని, మనం నాడు నేడుపై చర్చించుకోకపోతే మళ్లీ మోసగాళ్లు మోసం చేయడానికి మన ముందుకు వస్తారని, ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని రంగాల్లో అభివృధ్దితో పాటు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచనతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల ఆరోగ్యంపై ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారని, ఆయన తర్వాత ఐదేండ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాన్ని ముందుకు తీసుకెళ్లని దుస్థితి కాంగ్రెస్ పార్టీదని ఆయన విమర్శించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని, అలాగే 108, 104 తరహాలో 102ను ప్రవేశపెట్టి ఆడబిడ్డ గర్బం దాల్చిన సమయం నుంచి ప్రసవం జరిగే వరకు ఈ పథకం ద్వారా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసిన ఘనత బీఆర్‌ఎస్ సర్కారుదేనన్నరు. అంతే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరుగాలని, నార్మల్ డెలివరీలపై దృష్టిసారించాలని ప్రత్యేక చొరవ తీసుకోవడం తోపాటు కేసీఆర్ కిట్, ఆడబిడ్డ జన్మిస్తే రూ.13 వేలు, మగబిడ్డ జన్మిస్తే రూ.12 వేల సాయం అందించడం జరుగుతుందన్నారు. ఈనాడు మరింత గొప్పగా ఆలోచన చేసి గర్బవతిగా ఉండే అడబిడ్డల్లో రక్తహీనతబారి నుంచి రక్షించాలనే ఆలోచనతో న్యూట్రిషన్ కిట్‌ను అందిస్తున్నామని ఆయన తెలిపారు. పేద వర్గాలకు వైద్యం ఆర్థికబారం కావద్దని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనేక ఆధునాతన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సర్కారు దావఖానాలు మెరుగుపడ్డయ్




